close

తాజా వార్తలు

ప్రయోగాలనూ తొక్కిపెట్టారు: మోదీ

బాలాసోర్‌: గత ప్రభుత్వాలకు దేశ ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఒడిశాలోని బాలాసోర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేడు సెల్‌ఫోన్‌ నుంచి క్షిపణి వరకూ అన్నీ అంతరిక్షంలోని శాటిలైట్ల నుంచే చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాంటి అంతరిక్షంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. బాలాసోర్‌ నుంచి ప్రయోగించిన శక్తి క్షిపణి గమ్యాన్ని కొద్ది నిమిషాల్లోనే ఛేదించి ప్రపంచానికి భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు. అటువంటి క్షిపణి ప్రయోగాలను తొక్కిపెట్టి మిగిలిన వాటికే ప్రాధాన్యమివ్వడం వల్ల ఇప్పటి వరకూ మనకు ఈ సాంకేతికత అందకుండా పోయిందని అన్నారు. 

ఇప్పుడు ప్రపంచంలోనే అటువంటి సాంకేతికత కలిగిన నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని చెప్పారు. దీని వల్ల భారత్‌ నేలపై, నీటిపై, గాలిలో, అంతరిక్షంలో ఎక్కడైనా యుద్ధం చేయగల స్థాయికి చేరుకుందని తెలిపారు. 

ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంలో ఒడిశా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఒడిశా ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని భాజపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ మార్పును గ్రహించిన ఒడిశా ప్రభుత్వం భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net