close

తాజా వార్తలు

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు,  రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజవకర్గాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్ల పండుగలో పాల్గొన్నారు.  సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం  61.31శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా పశ్చిమ్‌ బంగలో 78.94 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 12.46శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5గంటల సమయానికి క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 18.85 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో 2.10లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా బలగాలను మోహరించారు. ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయని నిర్థారించుకున్నాకే ఓటింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మాతృమూర్తి ఆశీస్సులు తీసుకున్నాక ఓటువేసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఓ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి వెళ్లి ఇంటి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తన మాతృమూర్తి వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం అహ్మదాబాద్‌లోని రణీబ్‌ చేరుకొని అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేశారు. అనంతరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానితో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అనంతరం ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద పండుగ అని అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అహ్మాదాబాద్‌లోని షానగర్‌ హిందీ పాఠశాలలో భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

గుజరాత్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
గుజరాత్‌లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగింది. ఉదయం నుంచి ఓటర్లు తరగతి ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో ఓటు వేసిన మోదీ యువత ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గుజరాత్‌లో సాయంత్రం 5 గంటల వరకు 58.81 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో 26 సీట్లను సొంతం చేసుకున్న భాజపా ఈసారి కూడా అదే ఫలితాలు వస్తాయనే ధీమాతో ఉంది.  భాజపాకు ప్రధాన పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌ ఈసారి తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తంచేసింది. గుజరాత్‌లో 4.51కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంచేశారు.

రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలివీ..
⇒ అసోం - 74.05
⇒ బిహార్‌ - 54.95
⇒ ఛత్తీస్‌గఢ్‌ - 64.03
⇒ గోవా - 70.96
⇒ గుజరాత్‌ - 58.81
⇒ జమ్ము కశ్మీర్‌ - 12.46
⇒ కర్ణాటక - 60.87
⇒ కేరళ - 68.62
⇒ మహారాష్ట్ర - 55.05
⇒ ఒడిశా - 57.84
⇒ త్రిపుర - 71.13
⇒ ఉత్తర్‌ప్రదేశ్‌ - 56.36
⇒ పశ్చిమ్‌ బంగ - 78.94
⇒ దాద్రానగర్‌ హవేలి - 71.43
⇒ డామన్‌ డయ్యూ - 65.34

ఓటేసిన ప్రముఖుల చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండి

 

 


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net