close

తాజా వార్తలు

మీరు ప్రధానమంత్రి కాలేరు: మోదీ

అసన్‌సోల్‌(పశ్చిమ బెంగాల్‌): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశానికి ప్రధాన మంత్రి కావాలని వృథా ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దీదీ(మమతా) ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో దోపిడీ రాజకీయాలు చేస్తూ, దోపిడీ పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా అలాంటి రాజకీయాలు చేయడానికి, పన్నులు విధించడానికి చూస్తే ప్రజలు ఊరుకోరని, ఓటుతో బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న పదవి కూడా ప్రజల్ని మోసం చేసిన ఓ చిట్‌ఫండ్ సంస్థ నుంచి రాబట్టిన అక్రమ సొమ్ముతోనే సొంతం చేసుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్ని మోసం చేసి సంస్థను ఎత్తేసిన అక్రమార్కులను ఆమె కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. 

ఇలాంటి భావజాలంతో దేశంలో వేర్పాటువాద రాజకీయాలు చేయడానికి ఆమె సిద్ధమయ్యారన్నారు. ఆమె హయాంలో బెంగాల్‌లో నేరాలు, అవినీతి తారస్థాయికి చేరుకున్నాయని అన్నారు. వాటిని అరికట్టడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. మంచి ఆశయాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తూ, దాడి చేసిన శత్రువులపై మెరుపు దాడులు చేయించగలిగే ప్రభుత్వాన్నే మళ్లీ ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తనపై, ఎన్నికల సంఘంపై, కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఆమె ప్రదర్శిస్తున్న కోపాన్ని చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ఆమెకు అర్థమయినట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net