close

తాజా వార్తలు

బీఎస్పీ మొసలి కన్నీరు కారుస్తోంది: మోదీ

దిల్లీ: ఏప్రిల్‌ 26న రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ జంటను ఐదుగురు యువకులు అడ్డగించి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీపై  నిప్పులు చెరిగారు. తాజాగా ఇదే అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కూడా ఆరోపణలు చేశారు. మొసలి కన్నీరుకారుస్తూ ప్రజలకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నారన్నారు. ఒక వేళ ఘటనపై నిజంగా విచారం వ్యక్తం చేస్తే.. ఘటనకు బాధ్యత వహించని కాంగ్రెస్‌కు ఆమె ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మరోవైపు ఇదే అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం మాట్లాడుతూ.. అల్వార్‌ ఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని అరోపించారు. ఎన్నికలు జరిగే వరకు ఈ అంశాన్ని అణగదొక్కి రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఏప్రిల్‌ 26న ఘటన చోటు చేసుకోగా.. బాధితుల కుటుంబీకులు ఏప్రిల్‌ 30న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తగినంత సిబ్బంది లేరని, ఉన్న వారు కూడా ఎన్నికల విధులు వెళ్లిపోయారని సాకుగా చూపించి పోలీసులు ఫిర్యాదును స్వీకరించకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై మాయావతి స్పందించారు. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరతామన్నారు. ఫిర్యాదును స్వీకరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో భాజపాకు కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 25 స్థానాల్లోనూ గతంతో పోల్చుకుంటే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మరో వైపు అత్యధికంగా 80 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ భాజపాకు గట్టి సవాళ్లే ఎదురవుతున్నాయి. అఖిలేశ్‌ నాయకత్వంలోని ఎస్సీ,  మాయావతి నేతృత్వంలోని బీఎస్సీ  కూటమి ఏర్పాటు చేశాయి. ఫలితంగా ఇక్కడ నెగ్గుకు రావడం కాషాయ పార్టీకి అంతసులువేం కాదని విశ్లేషకులు అంటున్నారు.
‘అల్వార్‌ ఘటనను కాంగ్రెస్‌ సమర్థిస్తోందా? అలాంటి సంఘటనలను అణచివేయడానికి ఆ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది అన్న ధోరణిలో ఉంటోంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఇటీవల ఆ పార్టీనేత శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net