close

తాజా వార్తలు

రాబర్ట్ వాద్రాపై భగ్గుమంటున్న నెటిజన్లు

న్యూదిల్లీ: తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని చెబుతూ ట్విటర్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా చేసిన ఓ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు జల్లు కురుస్తోంది. ఎందుకంటే, ఆయన తన ట్వీట్‌లో భారత జెండా గుర్తుకి బదులుగా పరాగ్వే జాతీయ జెండాను పోస్ట్ చేశారు. ఇరు జెండాలు మూడు రంగులతో కూడిన జెండాలే. దీంతో ఆయన అనుకోకుండా ఈ ఎమోజీని పోస్ట్ చేశారు. ఆదివారం ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన భార్య ప్రియాంకతో కలిసి లోధి ఎస్టేట్‌ సర్దార్‌ పటేల్‌ విద్యాలయాలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.

అనంతరం అక్కడి నుంచి వెళ్లిన రాబర్ట్‌ వాద్రా... తన ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న సిరాతో సెల్ఫీ తీసుకుని తన ఫొటోను పోస్ట్ చేశారు. ‘మన హక్కే మన బలం. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనం ఇష్టపడే వారి కోసం, లౌకికవాదం నిలబడడం కోసం, సురక్షితమైన సమాజం కోసం, దేశ భవిష్యత్తు బాగుండడం కోసం అందరి మద్దతు కావాలలి’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు భారత జాతీయ జెండా అనుకొని పరాగ్వే జెండాను పోస్ట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ‘ఎట్టకేలకు తాను పరాగ్వే దేశానికి చెందిన పౌరుడినని రాబర్ట్ వాద్రా ఈ రోజు అంగీకరించారు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘తికమక పడి వాద్రా.. కాంగ్రెస్‌కి బదులు భాజపాకు ఓటు వేసి ఉండొచ్చు’ అని మరో నెటిజన్ చురకలంటించాడు. ఈ విషయాన్ని గుర్తించిన వాద్రా.. వెంటనే పరాగ్వే జెండాను తొలగించి, భారత జెండాను పోస్ట్ చేశారు. అయితే, అప్పటికే నెటిజన్లు స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.     



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net