close

తాజా వార్తలు

ఓటేయని దిగ్విజయ్‌ సింగ్‌.. ఎందుకంటే?

భోపాల్‌: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భోపాల్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. స్వగ్రామమైన రాఘోగఢ్‌లో ఆయన ఓటు వేయాల్సి ఉంది. కానీ సకాలంలో అక్కడికి చేరుకోలేకయారు. దీంతో ఓటు వేయలేకపోయానని దిగ్విజయ్‌ స్వయంగా వెల్లడించారు. దీని పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన తరువాతి ఎన్నికల్లో తప్పకుండా తన హక్కును వినియోగించుకుంటానన్నారు.‘‘నేను రాఘోగఢ్‌ చేరుకొని ఓటు వేయలేకపోయాను. దానికి నేను విచారిస్తున్నాను. తదుపరి ఎన్నికల సమయానికి నేను భోపాల్‌లోనే ఓటరుగా నమోదు చేయించుకుంటాను’’ అని దిగ్విజయ్‌ తెలిపారు. అయితే ఆయన సతీమణికి భోపాల్‌ నగర పరిధిలోనే ఓటు ఉండడంతో ఆమె మాత్రం ఓటు వేయగలిగారు.

తాను పోటీచేస్తున్న నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించిన దిగ్విజయ్‌ ఆదివారం మొత్తం తీరిక లేకుండా గడిపారు. దీంతో అక్కడే ఆలస్యమవడంతో పోలింగ్‌ ముగిసే సమయానికి ఆయన రాఘోగఢ్‌ చేరుకోలేకపోయారు. భోపాల్‌ నుంచి రాఘోగఢ్‌ 136కి.మీ దూరంలో ఉంటుంది. అంతకుముందు ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావాలని దిగ్విజయ్ పిలుపునిచ్చారు. అందరూ ఓటేయాలని చెప్పి చివరికి తానే ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ప్రత్యర్థి పార్టీలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భోపాల్‌ నుంచి భాజపా తరఫున సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా.. భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net