close

తాజా వార్తలు

‘అలా జరిగితే మోదీ ఉరేసుకుంటారా మరి?’

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ నేతలు తమ ప్రత్యర్ధులపై విమర్శల్లో పదును పెంచారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 40 స్థానాలు కూడా గెలవలేదంటున్న మోదీ.. ఒకవేళ ఆయన మాటలు నిజం కాని పక్షంలో ఉరి వేసుకుంటారా..? అంటూ ఘాటు విమర్శలు చేశారు. కర్ణాటకలో ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన(మోదీ) ఎక్కడికెళ్లినా.. కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా గెలవదని ప్రచారం చేస్తున్నారు. మీలో(ఓటర్లు) ఎవరైనా ఆయన మాటలతో ఏకీభవిస్తారా? ఒకవేళ మేం(కాంగ్రెస్‌) 40 స్థానాలకు మించి గెలిస్తే దిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద ఆయన ఉరివేసుకుంటారా?’’ అని ఖర్గే సవాల్‌ విసిరారు.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటికి మోదీ జన్మించలేదని.. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే సుదీర్ఘ పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందనడం సరికాదన్నారు. తనకు తాను వెనకబడిన వర్గానికి చెందిన వాడిగా చెప్పుకుంటున్న మోదీ.. కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. దీన్నే ప్రచారాస్త్రంగా చేసుకున్న మోదీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆ మాత్రం కూడా గెలవలేదని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net