close

తాజా వార్తలు

అమిత్‌ షా ర్యాలీకి  బెంగాల్‌  ప్రభుత్వం ‘నో’

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో పర్యటనకు సిద్ధమైన భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ర్యాలీకి బెంగాల్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. దీంతో బెంగాల్‌ ప్రభుత్వంపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మే 19న ఎన్నికలు జరిగే జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన ర్యాలీకి రాష్ట్ర యంత్రాంగం అనుమతి నిరాకరించింది. అంతేగాక.. షా చాపర్‌ ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతిని కూడా వెనక్కితీసుకుంది. కాగా, దీనిపై భాజపా తీవ్రంగా మండిపడింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ మౌనంగా ఉండటం దురదృష్టకరం. దీనిపై మేం ఆందోళన చేపడతాం’ అని భాజపా రాజ్యసభ ఎంపీ అనిల్‌ బాలుని తెలిపారు. 

బెంగాల్‌ ప్రభుత్వం నుంచి అమిత్ షాకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో దిగేందుకు ఆయన హెలికాప్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు భాజపా నేతల చాపర్ల ల్యాండింగ్‌కు కూడా పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌ అనుమతించకపోవడం గమనార్హం. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net