close

తాజా వార్తలు

నన్ను వారించగలిగేది వారొక్కరే: మోదీ

ఇండోర్‌: భాజపాలో తనను వారించగలిగే వ్యక్తి కేవలం సుమిత్రా మహాజన్‌ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం నిర్వహించిన ప్రచారం సందర్భంగా ఆయన మహాజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సభాపతిగా.. తాయి(సుమిత్రా మహాజన్‌ను నియోజకవర్గంలో ప్రజలు అభిమానంతో పిలుచుకునే పేరు) తన బాధ్యతలను ఎంతో నైపుణ్యంతో, చాలా చక్కగా నిర్వర్తించారు. సభలో ఆమె ప్రదర్శించిన చాకచక్యంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నేను మీ అందరికీ ఓ ప్రధానిగా తెలుసు. కానీ పార్టీలో అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే..నన్ను వారించగల ఏకైన వ్యక్తి తాయి. నేను, ఆమె చాలా కాలం పాటు పార్టీలో కలిసి పనిచేశాం. పనిపట్ల ఆమెకు ఉన్న నిబద్ధత గురించి నాకు తెలుసు. ఇండోర్‌ ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. నగర అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆమె తన ఆశయాలన్నీ నెరవేర్చుకోగలిగారు.’’ అని మహాజన్‌ పనితీరును మోదీ వివరించారు.

ఇండోర్‌ నుంచి మహాజన్‌ వరుసగా ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కానీ పార్టీలో అంతర్గతంగా ఉన్న వయసు నిబంధన ఆమె పోటీకీ ఈసారి అడ్డంకిగా మారింది. దీంతో పార్టీ నిర్ణయానికి ముందే తాను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాజన్‌ ప్రకటించారు. అయినప్పటికీ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2014లో  కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణ పటేల్‌పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ఇక్కడి నుంచి శంకర్‌ లాల్వానీని భాజపా బరిలోకి దించింది. తుది దశ పోలింగ్‌లో భాగంగా మే 19న ఇండోర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net