close

తాజా వార్తలు

ముందే తెలిస్తే సన్నీని పోటీ చేయనిచ్చేవాడిని కాదు

గురుదాస్‌పూర్‌: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సునిల్‌ జాఖర్‌ పోటీ చేస్తున్నారని తనకు ముందే తెలిస్తే సన్నీ దేవోల్‌ను పోటీ చేయనిచ్చేవాడిని కాదని అన్నారు అలనాటి బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర. ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు సన్నీ దేవోల్‌ ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గురుదాస్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ధర్మేంద్ర ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘బలరామ్‌ జాఖర్‌ నాకు సోదరుడు లాంటివారు. ఆయన కుమారుడు సునిల్‌ జాఖర్‌ గురుదాస్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారని నాకు ముందే తెలిస్తే సన్నీని నేను పోటీ చేయనిచ్చేవాడిని కాదు. అంతేగాక.. సునిల్‌ జాఖర్‌ అనువజ్ఞుడైన రాజకీయ నాయకుడు. మేం సినీ రంగం నుంచి వచ్చినవాళ్లం. అలాంటి వ్యక్తితో మేం డిబేట్‌ చేయలేం. మరో విషయమేంటంటే.. మేం డిబేట్‌ చేసేందుకు ఇక్కడకు రాలేదు. ప్రజల కోసం వచ్చాం. వారి కోసం పనిచేస్తాం’ అని ధర్మేంద్ర అన్నారు. 

గురుదాస్‌పూర్‌లో మే 19న ఎన్నికలు జరగనున్నాయి. భాజపాకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి విజయం సాధించిన వినోద్‌ ఖన్నా 2017లో మృతిచెందారు. అనంతరం ఉప ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌ నుంచి సునిల్‌ జాఖర్‌ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మళ్లీ గురుదాస్‌పూర్‌లో విజయం సాధించేందుకు మరోసారి సినీరంగానికి చెందిన నాయకుడిని ఎన్నుకుంది భాజపా. ఇందులో భాగంగానే సన్నీ దేవోల్‌ను రంగంలోకి దింపింది. దీంతో గురుదాస్‌పూర్‌ పోరు ఆసక్తికరంగా మారింది.  

ధర్మేంద్ర కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. 2004లో రాజస్థాన్‌లోని బికనేర్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన భార్య హేమా మాలిని ప్రస్తుతం యూపీలోని మథుర బరిలో ఉన్నారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net