close

తాజా వార్తలు

మోదీ మిగతావారిని ఎలా గౌరవిస్తారు?: మాయావతి

ఘాటుగా స్పందించిన జైట్లీ

లఖ్‌నవూ: బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ప్రధాని నరేంద్రమోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. అల్వార్‌ ఘటనపై చేసిన వ్యాఖ్యల వల్ల మోదీకి ఏ ప్రయోజనం ఉండదంటూ మీడియా ఎదుట ఆయనపై విరుచుకుపడ్డారు. 
‘మోదీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దళితుల పట్ల  చూపిస్తున్న కపట ప్రేమతో ఆయనకు ఒరిగేదేమి ఉండదు. గతంలో వారి మీద దాడులు జరిగిన అనేక సందర్భాల్లో ఆయన మౌనంగానే ఉన్నారు. అల్వార్‌ ఘటనపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని మాయావతి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం భార్యను వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లను, భార్యలను ఎలా గౌరవిస్తారు? అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని దేశంలోని మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికల సమయంలో పరిస్థితికి తగ్గట్టు ఆయన తన కులం గురించి మాటమారుస్తున్నారు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  వీటిపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగా స్పందించారు. ‘బెహన్‌ మాయావతి ప్రధాని కావాలని అనుకుంటున్నారు. ఆమె పరిపాలన, నైతికత, వ్యాఖ్యలు గతంలో కంటే దారుణంగా దిగజారాయి. ప్రధాని మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి, తాను ప్రజా జీవితానికి తగిన వ్యక్తి కాదని మాయావతి నిరూపించుకున్నారు’ అని ట్విటర్ వేదికగా జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఏప్రిల్ 26న జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్‌ మీద కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటమే దానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎన్నికల్లో ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాకూడదని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసును బయటకు రాకుండా చేస్తోందని మాయావతి కాంగ్రెస్‌ మీద మండిపడ్డారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net