close

తాజా వార్తలు

ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం: మోదీ

రత్‌లామ్‌(మధ్యప్రదేశ్‌): ఎన్నికలు ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది’ అనే వైఖరి కాంగ్రెస్‌ దురహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ప్రజలు వారి ఆటలు ఇక చాలించాలని హితవు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పక్కా ఇళ్లు, విద్యుత్తు సదుపాయం, వంట గ్యాస్‌, మరుగుదొడ్లు లాంటి ఎలాంటి సదుపాయాలకు నోచుకోనివారంతా ఇప్పుడు వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని తుపాకులు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు ఇలా ప్రతి రంగంలో అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు.    

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై మోదీ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ అక్కడి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కమల్‌నాథ్‌ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇది ప్రజల్ని మోసం చేయడమేనన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదించడానికి నిరాకరిస్తున్న కాంగ్రెస్..తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రం వెనకాడడం లేదన్నారు. భోపాల్‌ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఓ సీనియర్‌ నాయకుడిగా తొలిసారి ఓటర్లకు ఆయన తప్పుడు సందేశం ఇస్తున్నారని ఆరోపించారు. చివరి దశ పోలింగ్‌లో భాగంగా మే 19న మధ్యప్రదేశ్‌ మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net