close

తాజా వార్తలు

ఆయనకు వెంటనే ఫోన్ చేశాను: రాహుల్ 


ఫతేగఢ్‌ సాహిబ్: 1984 సిక్కుల ఊచకోతపై మీడియా ప్రశ్నకు శామ్ పిట్రోడా తప్పుగా సమాధానమిచ్చారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలపై చెలరేగుతోన్న వివాదంపై తన అభిప్రాయమేంటో సోమవారం మరోసారి రాహుల్ వెల్లడించారు. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా దానిపై ఆయన స్పందించారు. 
‘1984లో జరిగిన సిక్కుల ఊచతకోతపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. దానిపై ఆయన ఈ దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ఆయనకు ఫోన్‌ చేసి మీరు తప్పుగా వ్యాఖ్యలు చేశారని చెప్పాను. అతడు సిగ్గు పడుతూ, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి’ అని రాహుల్ వెల్లడించారు. 
గత వారం సిక్కు అల్లర్ల ఘటనపై స్పందిస్తూ కాంగ్రెస్‌ నేత శామ్ పిట్రోడా జరిగిందేదో జరిగిపోయందని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. దానిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఇది కాంగ్రెస్ మెంటాలిటీకి నిదర్శనమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆ వివాదంపై కాంగ్రెస్‌ స్పందించాల్సి వచ్చింది. అది పార్టీ అభిప్రాయం కాదని తేల్చిచెప్పింది.  ఆ వెంటనే శామ్ పిట్రోడా క్షమాపణలు కోరారు. శనివారం రాహుల్ ఆ వ్యాఖ్యలు సరైనవి కావంటూ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.  



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net