close

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రియాంకా పూజలు


ఉజ్జయిని: సార్వత్రిక ఎన్నికల చివరి విడత ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ చీర కట్టులో ప్రియాంక గాంధీ అభిషేకం చేశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కాషాయ వస్త్రాలు ధరించి పూజలో పాల్గొన్నారు. వారి వెంట కేంద్రమంత్రి సురేశ్‌ పచౌరి, పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. దాదాపు గంటకుపైగా ఆమె పూజలు నిర్వహించారు.

అనంతరం ఉజ్జయిని లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు విశేష స్పందన వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శోభా ఓజా తెలిపారు. ఉజ్జయిని స్థానంలో కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే బాబుల మాల్వియా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి భాజపా నుంచి అనిల్‌ ఫిరోజియా పోటీ చేస్తున్నారు. ఉజ్జయిని  లోక్‌సభ స్థానానికి ఏడో విడతలో భాగంగా ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది.

తాజా ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. నాయనమ్మ ఇందిరా గాంధీ హావభావాలను వ్యక్తం చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. తన ప్రచారంలో స్థానిక సమస్యలతోపాటు భారత ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన తదితర అంశాలను చర్చిస్తూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net