close

తాజా వార్తలు

ఇప్పటివరకు ఏ పార్టీ అధ్యక్షుడు అలా అనలేదు: రాజ్‌నాథ్‌

దిల్లీ: దేశంలో రాజకీయ విలువలను దిగజార్చేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారెవరు కూడా దేశ ప్రధానిని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ అసభ్యపదజాలంతో దూషించలేదంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశ్చిమబంగాలో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 30 స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అని అన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకి పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో ప్రధాని ఎంపిక విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు.. అసలు అలాంటి పరిస్థితి తలెత్తదంటూ ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధి పట్ల దూరదృష్టి ఉన్నవారు, శక్తివంతమైన, దృఢమైన నాయకుడు మోదీ అని.. ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయంటూ రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో భాగంగా రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ పార్టీ నాయకులైనా ఎలాంటి విమర్శలు చేస్తున్నప్పటికీ రాజకీయ విలువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ విషయంలో ఒక దేశ ప్రధాని పట్ల అసభ్య రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగజారిపోయారంటూ ఆయన ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగాలతో రాజకీయ విలువలు దిగజార్చేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను రాజ్‌నాథ్‌ తోసిపుచ్చారు. ‘దేశ ప్రధాని, రాష్ట్రపతి సాధారణ ప్రజల్లో ఒకరు కాదు. వ్యక్తిగతంగానే వారు ఒక వ్యవస్థ లాంటివారు. అలాంటి వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించకుండా చూడాల్సిన బాధ్యత దేశంలో అందరిపై ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినట్లే అవుతుంది’ అంటూ వివరించారు. బీఎస్పీ, ఎస్పీ కూటమి ప్రభావం పార్టీపై ఏమాత్రం ఉండబోదని, 2014లో గెలిచిన స్థానాలకన్నా అత్యధిక స్థానాల్లో గెలుస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net