close

తాజా వార్తలు

నిరూపించే సత్తా మీకు ఉందా..?:మోదీ

బాలియా(ఉత్తరప్రదేశ్‌): తనకు బినామీ ఆస్తులు, విదేశీ బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నాయంటున్న ప్రతిపక్షాలన్నీ కలిసి వాటిని రుజువు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సవాల్‌ విసిరారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే కొందరి ఆస్తులు, వారి బంధువుల ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని ఆరోపించారు. ‘మహా కూటమి నేతలకు ఒక సవాల్‌ విసురుతున్నాను. నా దగ్గర బినామీ ఆస్తులేమైనా ఉన్నా, విదేశీ బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా, ఏదైనా ఆస్తిని నేను కొనుగోలు చేసినా, విలాసవంతమైన కార్లు కొన్నా వాటన్నిటినీ మహాకూటమి నేతలు నిరూపించాలి. వారు అధికారంలోకి వచ్చాక కుల రాజకీయాలను ప్రోత్సహించారు. పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. వారు, వారి బంధువులు కలిసి ఎన్నో ఆస్తులు కూడబెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారు నాపై చేస్తున్న నిరాధార ఆరోపణలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారు. ఎప్పుడూ ఒకరిని ఒకరు తిట్టుకునే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నేడు అధికారం కోసం కూటమి కట్టాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మళ్లీ ఆ పార్టీల పరిస్థితి అలాగే ఉండబోతోంది. వారిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన దానికంటే ఎక్కువసార్లు నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పటి వరకూ నాపై ఒక్క ఆరోపణ లేదు. కాని వారిపై ఎన్ని ఆరోపణలున్నాయో మీ అందరికీ తెలుసు. నేను నేరుగా ప్రజాక్షేత్రంలో గెలిచాను. ఎప్పుడూ కులం పేరుతో ఓట్లు అడగలేదు’ అని అన్నారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net