close

తాజా వార్తలు

భాజపాతో డీఎంకే చర్చలు: సౌందరరాజన్‌

నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్న స్టాలిన్‌

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం డీఎంకే తమ పార్టీతో చర్చలు జరుపుతోందని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు, తూత్తుకుడి లోక్‌సభ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత ఇరు పార్టీలు కలిసే అవకాశం ఉందని చెప్పారు. ‌మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘భాజపాతో డీఎంకే సంప్రదింపులు జరుపుతోంది. ఇది నిజం.. ఒకరి ద్వారా వారు చర్చలు జరుపుతున్నారు. మరోసారి విజయం సాధించడానికి భాజపా సిద్ధంగా ఉంది. ఎన్నికల అంచనాలన్నీ భాజపా విజయాన్నే సూచిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భాజపాకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. 

సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీఎంకే అధినేత స్టాలిన్‌ ఓ ప్రకటన చేశారు.‌ ‘నేను భాజపాతో కూటమిని ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నానని ప్రధాని మోదీ, సౌందరరాజన్ రుజువు చేస్తే నేను రాజకీయాలను వదిలివేస్తాను. ఒకవేళ ఈ ఆరోపణలను రుజువు చేయకపోతే వారు రాజకీయాలను వదిలేస్తారా? భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు చేసిన ప్రకటనను నేను ఖండిస్తున్నాను’ అని తెలిపారు. కాగా, తమిళనాడులో ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. 


 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net