close

తాజా వార్తలు

అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి.. ఘర్షణ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహిస్తున్న మెగా ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. ఆయన నిర్వహిస్తున్న ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. భాజపాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరేయడంతో భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పు అంటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు తెలుస్తోంది. 

అమిత్‌ షా ర్యాలీ కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే ఈ ఘర్షణలు చెలరేగాయి. ఆయన కాన్వాయ్‌పైకి కాలేజీ హాస్టల్‌ నుంచి కొందరు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో ఆ భవనం ముందు భాజపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విషయంపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా షా ఓ మీడియాకు తెలిపారు. ఆయన ర్యాలీ ప్రారంభించక ముందు కూడా కోల్‌కతాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భాజపా జెండాలను ధ్వంసం చేశారు. కాగా, తన కోల్‌కతా ర్యాలీ అనంతరం షా తన ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందించారు. ‘ర్యాలీకి వచ్చిన భారీ స్పందన పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు. భాజపాకు బెంగాల్‌ ప్రజల నుంచి వచ్చిన స్పందనతో అరాచక మమతా బెనర్జీ ప్రభుత్వం వణికిపోయి ఉంటుంది.. మమతా దీదీ అధికారం నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net