close

తాజా వార్తలు

జాతీయ భద్రతను వారు పట్టించుకోవడం లేదు..

అభివృద్ధి ప్రాజెక్టులతో మళ్లీ మీ ముందుకొస్తాను


పాలీగంజ్‌: తమ ప్రభుత్వం అనుసరించిన కఠినమైన విధానాలతోనే ఉగ్రవాదాన్ని రూపుమాపగలుగుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.  బుధవారం బిహార్‌లోని పాలిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..విపక్షాలు జాతీయ భద్రతను ఒక అంశంగానే చూడటంలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘మహామిలావత్ సభ్యులు జాతీయ భద్రతను తీవ్రమైన అంశంగా పరిగణించడంలేదు. ఉగ్రదాడుల్లో అమాయక ప్రజల ప్రాణాలు పోతుంటే దీన్ని తీవ్రంగా చూడకుండా ఎలా ఉంటాం?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాలాకోట్ వైమానిక దాడులతో ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే హతమార్చిన తీరును ప్రస్తావించారు. అలాగే ఈ రాష్ట్రంలో ఇది తన చివరి బహిరంగ ఎన్నికల  ప్రచారమని చెప్పేప్పుడు మోదీ  ఉద్వేగానికి గురయ్యారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఇది నా చివరి ఎన్నికల ప్రచారం. కొత్తగా అధికారాన్ని చేపట్టాక అభివృద్ధి పథకాలతో మీ ముందుకు వస్తాను. మీరు చూపించే ప్రేమ నాకు విజయం మీద నమ్మకాన్ని ఇచ్చింది’ అని వెల్లడించారు. అలాగే సిక్కుల ఊచకోతకు సంబంధించి కాంగ్రెస్‌ నేత పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి ఆ పార్టీ మీద మండిపడ్డారు. బిహార్‌లో కాంగ్రెస్ మిత్ర పక్షం ఆర్జేడీ మీద విమర్శలు చేశారు. కుల రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుందన్నారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించారు.  



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net