close

తాజా వార్తలు

రెండు బడ్జెట్లు ప్రవేశపెడతాం: రాహుల్‌

అమృత్‌సర్‌ (పంజాబ్‌): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 19న పంజాబ్‌లోని 13 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘పెద్దనోట్ల రద్దు వల్ల దేశ జీడీపీ 2 శాతం తగ్గిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. ఆయన చెప్పినట్లే ఆ తదుపరి ఏడాది జరిగింది. కాంగ్రెస్‌ ప్రకటించిన న్యాయ్‌ పథకం కేవలం దేశంలోని 25 కోట్ల పేదలకు లబ్ధి చేకూర్చడమే కాదు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పుంజుకునేలా చేస్తుంది. దీని వల్ల దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటులో రెండు బడ్జెట్లు ప్రవేశపెడతాం. మొదటి బడ్జెట్‌ రైతుల కోసం, రెండో బడ్జెట్ జాతీయ బడ్జెట్. రైతులకు మా ప్రభుత్వం ఎంత సాయం చేయాలనుకుంటుదన్న విషయాన్ని పార్లమెంటులో జాతీయ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందే చెబుదాం. కనీస మద్దతు ధర ఎంత పెంచామో చెబుతాం. ఎన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లు తెరిచామో ప్రకటిస్తాం.. వీటితో పాటు మరిన్ని విషయాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు. 

‘కొత్త వ్యాపారాలు స్థాపించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మేము అధికారంలోకి వచ్చాక.. మీరు చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకుంటే మూడేళ్ల పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాము. నాతో చర్చించాలని ప్రధాని మోదీకి నేను సవాలు విసిరాను. నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. కానీ, ఆయన మూడు గంటలు మాట్లాడుకోవచ్చు. అయినప్పటికీ ఆయన నాతో చర్చించడానికి ఒప్పుకోవట్లేదు.. ఆయన భపడుతున్నారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.    


 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net