close

తాజా వార్తలు

అమిత్‌ షా అబద్ధాలు బయటపడ్డాయి: టీఎంసీ

దిల్లీ: భాజపా ఆందోళకారులు సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆధారాలున్న ఓ వీడియోను తృణమూల్ కాంగ్రెస్‌ విడుదల చేసింది. పార్టీ దాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ఘర్షణకు టీఎంసీ కారణమని, దానిపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే టీఎంసీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై టీఎంసీ సీనియర్‌ నేత డెరెక్‌ ఓబ్రిన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఆ వీడియోలో భాజపా చర్యలు స్పష్టంగా తెలియడమే కాకుండా, అమిత్‌ షా అబద్ధాలు బయటపడ్డాయి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న జరిగిన ఘటనతో బెంగాల్ వీధులు భయం, ఆగ్రహంతో ఉన్నాయి. అది బెంగాల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది’ అని మండిపడ్డారు. అమిత్‌ షా ర్యాలీకి రాడ్లు పట్టుకొని రావాలని, టీఎంసీ కార్యకర్తలు, పోలీసుల మీద దాడి చేయాలని ఉన్న వీడియోను,  వాట్సాప్‌ సందేశాన్ని ఆ పార్టీ బయటపెట్టింది. ‘ విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలి. వేర్‌ ఈజ్‌ ద జోష్‌’ అని సూచిస్తోన్న ఒరిజినల్ వీడియో కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. భాజపాకు ఓటు వేయాలని కేంద్ర భద్రతాబలగాలు నిశబ్దం ప్రచారం చేస్తున్నాయని ఓబ్రిన్‌ ఆరోపించారు. 
మంగళవారం కోల్‌కతా వీధుల్లో అమిత్ షా నిర్వహించిన ర్యాలీలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ గొడవల్లోనే సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైంది. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net