close

తాజా వార్తలు

బంగాల్‌లో హింసాత్మక ఘటనలకు దీదీదే బాధ్యత

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా 

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అమిత్‌ షా ర్యాలీ నేపథ్యంలో నిన్న బంగాల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత. రాష్ట్రంలో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా పోలింగ్‌ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కేవలం పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుంది. కానీ మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం. గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. దీనికి తృణమూల్‌ కాంగ్రెసే బాధ్యత వహించాలి’ అని అమిత్ షా అన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మంగళవారం కోల్‌కతాలో రోడ్‌ షో నిర్వహించగా.. తీవ ఉద్రిక్తత చోటుచేసుకుంది. షా రోడ్‌ షోకు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో రెచ్చిపోయిన భాజపా కార్యకర్తలు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. 


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net