close

తాజా వార్తలు

ప్రజాస్వామ్యమంటే ఇదేనా: రౌత్‌

ముంబయి: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ్‌బెంగాల్‌ వెళ్లిన భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాపై దాడులు చేయించడం అత్యంత బాధాకరమని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చునని, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు. మోదీ, అమిత్‌ షా పశ్చిమ్‌బెంగాల్‌లో ప్రచారం చేయడం మమతా బెనర్జీకి నచ్చలేనట్లు కనిపిస్తుందన్నారు. కాని ఆమె గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్విహిస్తే ఎటువంటి ఘటనలూ జరగకుండా గుజరాత్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య భారతంలో ఇటువంటి ఘటనల వల్ల దేశ సమగ్రత బీటలు వారే ప్రమాదాలు ఉన్నాయన్నారు. బెంగాల్‌ పునరుజ్జీవనం కోసం పాటుపడిన ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమని అన్నారు. 

ఇప్పుడు మిత్ర పక్షాల సహాయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీ చూసినా, 1996లో వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలా బలంగా ఉండబోదని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయని, అన్నిటికీ మే 23 వరకూ వేచి చూడాల్సిందేనని అన్నారు. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని, ఇప్పటి వరకూ భాజపా ఎంత బలంగా ఉందో ఇకపై అంత కంటే ఎక్కువ బలంగా ఉండనుందని తెలిపారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net