close

తాజా వార్తలు

వీఐపీ సంస్కృతి వద్దన్నారు కదా?: వాద్రా 

న్యూదిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా విమర్శలు గుప్పించారు. ఓ వైపు వీఐపీ సంస్కృతి వద్దని మోదీ చెబుతోంటే.. మరోవైపు, ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆయన విమర్శించారు. తన భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ మంగళవారం రాజస్థాన్‌‌లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాల్సి ఉండగా, ఇందుకు  ఒప్పుకోని ప్రహ్లాద్‌.. వారిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని మండిపడ్డారు.

రాబర్ట్‌ వాద్రా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ... ‘ఇతరుల్లో ఉన్న చెడు అలవాటు మనలోనూ ఉన్నప్పుడు, ఇతరులను అదే విషయంపై విమర్శించొద్దన్న సూక్తి మన ప్రధాని మోదీకి వర్తిస్తుంది. వీఐపీ సంస్కృతి ఎందుకంటూ ఆయన ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఆయన సోదరుడే తన భద్రతా బలగాలకు ప్రత్యేక వాహనం కావాలంటూ ధర్నకు దిగారు. ఇదేనా అచ్ఛేదిన్‌?’ అని ఫేస్‌బుక్‌లో విమర్శలు గుప్పించారు. ‘రెండేళ్ల క్రితం నా భద్రతా సిబ్బందిని సగానికి తగ్గించారు. అయినప్పటికీ నేను అందుకు అంగీకరించాను. నా విషయంలోనే కాదు.. మా అమ్మ ఉంటున్న ఇంటి వద్ద ఉండే ఇద్దరు భద్రతా బలగాలను కూడా తొలగించారు. దీన్ని కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ, ఇప్పుడు చూడండి... భద్రతా బలగాలకు వాహనం కావాలంటూ మోదీ సోదరుడు ఎలా ధర్నాకు దిగారు’ అని ఆయన పేర్కొన్నారు.     



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net