close

కథనాలు

అమరీందర్‌ విసిరిన ‘ఆర్మీ కార్డు’! 

పంజాబ్‌లో భాజపాకు దీటుగా ప్రచారం 
చండీగఢ్‌ నుంచి విశాల్‌ గులాటీ

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ (77) తన ప్రచార వ్యూహానికి సాన పెట్టారు. జాతీయవాదం, పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌ దాడులను ప్రస్తావిస్తూ ఓట్లను ఒడిసిపట్టేందుకు భాజపా వేస్తున్న ఎత్తుగడను ఆయన అంతే దీటుగా తిప్పికొడుతున్నారు. సాధారణంగానే పంజాబ్‌లో సైనిక కుటుంబాలు ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘‘ఇక్కడ చాలామంది మాజీ సైనికులు కనిపిస్తున్నారు. మీలో ఎంతమంది 1965 నాటి భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొన్నారు? నేను కూడా ఒక సైనికుడిగా దేశానికి సేవ చేశాను. అది నా భాగ్యం. కానీ గుర్‌దాస్‌పుర్‌ నియోజకవర్గంలో భాజపా ఓ సినిమా సైనికుడిని (సన్నీ దేవోల్‌ని) రంగంలోకి దింపింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. బాలాకోట్‌ దాడుల్లో పాల్గొన్నది ఆయన సైన్యం కాదు. భారత సైన్యం. వారికి దక్కాల్సిన పేరును తన ఖాతాలో వేసుకోవడానికి ప్రధాని ఆరాటపడుతున్నారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారు. కానీ ఏనాడూ ఆ ఘనత తమది అని కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోలేదు’’ అంటూ అమరీందర్‌ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పలు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల ఇళ్లకూ వెళ్తున్నారు. విశ్రాంత సైనికులు ఎక్కువగా ఉండే పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net