close

కథనాలు

మోదీ 25 ఏళ్లు ఏలేస్తారు 

రామ్‌మనోహర్‌ లోహియా చెప్పింది నిజం చేస్తారు 
ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు

గోరఖ్‌పుర్‌: పేదలకు మరుగుదొడ్లు, వంట చేసుకునే ఇంధనాన్ని సమకూర్చడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి సారించినందున రామ్‌మనోహర్‌ లోహియా చెప్పినట్లుగా ఆయన మరికొన్నేళ్లపాటు దేశాన్ని పరిపాలిస్తారని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ చెప్పారు. బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. సోషలిస్ట్‌ నాయకుడు లోహియా కలను మోదీ నిజం చేస్తారని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక విస్పష్ట మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని చెప్పారు. ‘‘దేశంలో ఎక్కువమంది ప్రజలు గ్రామాల్లో జీవిస్తున్నారు. దేశంలోని ప్రతి పేదవ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డి ఉండి, అతను వంటచేసుకునేందుకు అవసరమైన ఇంధన అవసరాలు తీరినరోజు ప్రధాని స్థానంలో కూర్చున్న వ్యక్తి 25 ఏళ్లు పాలిస్తారని లోహియా ఇందిరాగాంధీతో అన్నారు’’ అని వెల్లడించారు. లోహియా పేరుతో చాలా మంది రాజకీయాలు చేసినా మోదీ మాత్రమే ఆయన కలను నెరవేర్చారన్నారు. ప్రధాని మోదీ హయాంలో 1.5 కోట్ల మంది పేదలకు ఇళ్లు, నాలుగు కోట్ల మందికి విద్యుత్తు కనెక్షన్లు, ఏడు కోట్ల మంది పేద మహిళలకు గ్యాస్‌ సిలెండర్లు సమకూర్చిన సంగతిని ఆదిత్యనాథ్‌ గుర్తుచేశారు. అంతేకాకుండా ఈ ఐదేళ్లలో 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, 12.5 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద సహాయం అందిందని, 15 కోట్ల మంది యువతకు ముద్ర యోజన కింద లబ్ధి చేకూరిందని చెప్పారు. 37 కోట్ల మంది జన్‌ధన్‌ ఖాతాలు తెరిచారని వివరించారు.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net