close

కథనాలు

ఎన్డీయేకు 8 టెన్షన్‌! 

బిహార్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏడో దశలో పోలింగ్‌ 
ముస్లిం- యాదవ ఓట్ల ఏకీకరణపై ఎన్డీయేలో కలకలం 
రాజీవ్‌ రాజన్‌ 
బిహార్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

బిహార్‌ ఏడోదశ పోలింగులో ముస్లిం-యాదవ ఓట్ల ఏకీకరణ జరిగితే అది మహాకూటమికి అనుకూలంగా మారే అవకాశముంది. తేజస్వి - తేజ్‌ప్రతాప్‌ కలయిక వల్ల ఆ దిశగా సూచనలు కనపడటంతో జేడీ(యూ) స్వరం మారింది. 

రోదశ పోలింగ్‌ ముగిసిన తర్వాత బిహార్‌లో సమీకరణాలు మారుతున్నాయి. జేడీయూ సీనియర్‌ నాయకుడు గులామ్‌ రసూల్‌ బల్యావీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికలలో మేం మోదీ లేదా భాజపా పేరుతో కాకుండా.. ఎన్డీయే పేరుతో ఓట్లు అడుగుతున్నాం. ఎన్డీయేకు ఆధిక్యం తగ్గితే ప్రధాని పదవికి నీతీశ్‌కుమార్‌ పేరును ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. ఆ పదవిలో ఉంటే ఆయన బిహార్‌కు తప్పనిసరిగా ప్రత్యేకహోదా మంజూరు చేస్తారు’’ అని బల్యావీ అన్నారు. జేడీయూ అధికార ప్రతినిధులు ఈ ప్రకటనను ఖండించినా, నీతీశ్‌ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. లాలు ప్రసాద్‌ రాంచీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతుండా.. ఆయన కుమారులు తేజస్వి, తేజ్‌ప్రతాప్‌ మధ్య మైత్రి కుదరడంతో ముస్లిం-యాదవ ఓట్లు మహాకూటమికి గంపగుత్తగా పడతాయేమోనన్న భయంతోనే నీతీశ్‌ మౌనం పాటిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏడోదశలో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వీటిపై యాదవ - ముస్లిం ఓట్ల ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఇంతకుముందు లాలు కొడుకులు తేజ్‌ప్రతాప్‌, తేజస్వి యాదవ్‌ల మధ్య విభేదాలతో యాదవులలో కొందరు భాజపావైపు, ముస్లింలలో కొంతమంది జేడీయూ-ఎల్‌జేపీ వైపు మొగ్గారు. తుదిదశలో ఈ వర్గాల ఓట్లన్నీ మహాకూటమికి గంపగుత్తగా పడితే తమకు ప్రమాదమన్న ఆలోచనతోనే బల్యావీ ప్రకటనను నీతీశ్‌ పరోక్షంగా సమర్థిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. 
తేజస్వి అడుగులు 
తండ్రి లేకుండా తొలిసారి ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తున్న లాలు చిన్నకుమారుడు తేజస్వి యాదవ్‌ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్న తేజ్‌ప్రతాప్‌తో కలిసి పాటలీపుత్ర స్థానంలో తన అక్క మీసాభారతికి అనుకూలంగా ప్రచారం చేశారు. జహానాబాద్‌, గోపాల్‌గంజ్‌ స్థానాలలో తాను ప్రతిపాదించిన పేర్లను కాదన్నందుకు అక్కడ ఆర్జేడీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తేజ్‌ప్రతాప్‌ తొలుత ప్రచారం చేశారు. ఒకదశలో 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను లాలు రబ్రీ మోర్చాను స్థాపించి అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడతానని కూడా చెప్పారు. తర్వాత తమ్ముడితో రాజీపడి తామిద్దరం కలిసి ఉంటామన్నారు. ఇదే ముస్లిం - యాదవ ఓట్ల ఏకీకరణకు దారితీస్తుందేమోనని ఎన్డీయే కూటమిలో ఆందోళన మొదలైంది. 
లాలు బహిరంగ లేఖ 
ఇదే సమయంలో.. అంటే ఆరోదశ పోలింగ్‌ ముగిసిన రోజున రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్‌.. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. అది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆర్జేడీ ఎన్నికల గుర్తు లాంతరు. తాము ఇస్తున్న విద్యుత్‌ సరఫరా వల్ల లాంతరు అవసరం రాష్ట్రంలో లేకుండా పోయిందని నీతీశ్‌ అంతకుముందు వ్యాఖ్యానించారు. అయితే లాలు రాసిన లేఖలో తమ గుర్తును సమర్ధించుకున్నారు. ‘‘లాంతరు నుంచి వచ్చే వెలుగులు సమాజంలోని బలహీన వర్గాల బతుకుల్లో అసమానత, అన్యాయం వల్ల ఏర్పడిన చీకటిని తరిమేశాయి. కానీ జేడీయూ బాణం మాత్రం హింసకు, రక్తపాతానికి నిదర్శనం’’ అని ఆయన అన్నారు. 


బిహార్‌లో ఏడోదశలో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్న 8 లోక్‌సభ స్థానాల్లో ఏడింటిని 2014 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి గెలుచుకుంది. వాటిలో అయిదు భాజపా ఖాతాలోకి వెళ్లగా, ఆర్‌ఎల్‌ఎస్పీకి రెండు, జేడీయూకు ఒకటి దక్కాయి.

పట్నాసాహిబ్‌ 
గ్రవర్ణ ఓటర్లు 28% వరకు ఉన్న ఈ నియోజకవర్గం సుదీర్ఘకాలంగా భాజపాకు కంచుకోటగా ఉంది. 2014 కంటే ఈసారి ఈ ఓట్లు మరింత ఎక్కువగా భాజపా ఖాతాలో పడేలా ఉన్నాయి. యాదవేతర ఓబీసీలు కూడా జేడీయూ ప్రభావంతో భాజపా అభ్యర్థి రవిశంకర్‌ ప్రసాద్‌వైపు మొగ్గు చూపవచ్చు. ఇక్కడినుంచి ఇంతకుముందు భాజపా అభ్యర్థిగా గెలిచిన శతృఘ్నసిన్హా ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం విశేషం. పైపెచ్చు ఈసారి వీరిద్దరి మధ్య ముఖాముఖి పోరు ఉంది.
పాటలీపుత్ర 
లాలుప్రసాద్‌ కుమార్తె మీసాభారతిపై సిటింగ్‌ ఎంపీ, భాజపా నాయకుడు రాంకృపాల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. 2014లో ఇదే స్థానంలో ఆయన చేతుల్లో ఓడిపోయిన మీసాభారతి.. తర్వాత రాజ్యసభ సభ్యత్వం పొందారు. తొలుత కొన్నాళ్ల పాటు సోదరుల అండ కూడా లభించకపోయినా, తాజాగా తేజ్‌ప్రతాప్‌, తేజస్వి ఇద్దరూ ఆమెకు అనుకూలంగా ప్రచారం చేశారు.
బక్సర్‌ 
ర్జేడీ సీనియర్‌ నాయకుడు జగదానంద్‌ సింగ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీ చౌబే తలపడుతున్నారు. వీరిద్దరూ అగ్రవర్ణ అభ్యర్థులే. చౌబే బ్రాహ్మణుడు కాగా, జగదానంద్‌ రాజపుత్రుడు. అగ్రవర్ణ పేదలకు మోదీ సర్కారు ఇచ్చిన 10% కోటాను ఆర్జేడీ వ్యతిరేకించిందన్న ప్రచారంతో అగ్రవర్ణ ఓట్లను చీల్చుకోడానికి భాజపా ప్రయత్నిస్తోంది.
అరా 
కేంద్ర విద్యుత్‌శాఖ సహాయమంత్రి ఆర్కే సింగ్‌ భాజపా తరఫున అరా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సీపీఐ (ఎంఎల్‌) అభ్యర్థి రాజు యాదవ్‌తో ముఖాముఖి తలపడుతున్నారు. యాదవ్‌ బరిలో ఉండటంతో ఆర్కేసింగ్‌ కొందరు శక్తిమంతులైన భూమిహార్ల మద్దతు తీసుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జహానాబాద్‌ 
త సార్వత్రిక ఎన్నికలలో ఆర్‌ఎల్‌ఎస్‌పీ అభ్యర్థి అరుణ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయిన సురేంద్ర యాదవ్‌నే ఆర్జేడీ మరోసారి బరిలోకి దించింది. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎస్‌పీ మహాకూటమిలో ఉండటంతో అరుణ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జేడీయూ తరఫున ఈబీసీ అభ్యర్థి చందేశ్వర్‌ చంద్రవంశీ పోటీలో ఉన్నారు.
కారాకాట్‌ 
భాజపా మద్దతుతో ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి కాంతిసింగ్‌పై గెలిచారు. ఇపుడు ఆర్జేడీ, కాంగ్రెస్‌ సాయంతో మహాకూటమి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కుశ్వాహాపై నీతీశ్‌కుమార్‌ సన్నిహితుడు మహాబలి సింగ్‌ పోటీ చేస్తున్నారు.
ససారామ్‌ 
భాజపా సిటింగ్‌ ఎంపీ ఛేదీ పాస్వాన్‌పై లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 1989, 2014 ఎన్నికలలో రెండుసార్లు ఆయన మీరాకుమార్‌ను ఓడించారు. లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌గా పనిచేసిన తర్వాత ఓడిపోయిన మీరాకుమార్‌కు ఈ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 1984 ఎన్నికల వరకు ఆమె తండ్రి జగ్జీవన్‌ రామ్‌ వరుసగా 8  సార్లు ఈ స్థానంలో గెలిచారు.
నలందా 
కుర్మీలు దాదాపు 30% వరకు ఉన్న ఈ స్థానాన్ని జేడీయూ 1999 నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. యాదవేతర ఓబీసీలు, ముస్లింలు ఆ పార్టీకి గట్టి మద్దతుగా ఉన్నారు. ఈసారి మహాకూటమి తరఫున ఈబీసీ అభ్యర్థి అశోక్‌ ఆజాద్‌ చంద్రవంశీ వీఐపీ పార్టీ నుంచి నిలబడ్డారు. ఆయనపై జేడీయూ సిటింగ్‌ ఎంపీ కౌశలేంద్రకుమార్‌ పోటీ చేస్తున్నారు.

మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net