వ్యక్తిత్వం లేని భర్తతో వేగేదెలా?
నాకీమధ్యే పెళ్లైంది. జీవిత భాగస్వామి గురించి ఎన్నో వూహించుకున్నా. దురదృష్టవశాత్తు నా భర్త సొంత నిర్ణయాలు తీసుకోలేడు. పైకెదిగే లక్షణాలు లేవు. పైగా కోపిష్టి. నాపై పదేపదే ఫిర్యాదు చేస్తుంటాడు. తల్లి మాటే వింటాడు. నేనుద్యోగం చేస్తున్నా సాయం చేయడు. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలి? కెరీర్లో నేనెలా ఎదగాలి?
- చైతన్య, హైదరాబాద్
ఆశించింది దక్కకపోతే దక్కిందే ఆశించాలి అంటాడో వేదాంతి. అలా చేయకపోతే మానసిక ఒత్తిళ్లకు గురవుతాం. అప్పుడు ఎదుటివాళ్లలోని లోపాలు మాత్రమే గుర్తొస్తాయి. గతంలో సోక్రటీస్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అతడి
మంచి మాటలు, సిద్ధాంతాలు తెలుసుకోకుండా అప్పటి రాజకీయ యంత్రాంగం ఆయన తప్పులు చేస్తున్నాడనీ, యువతను పెడదోవ పట్టిస్తున్నాడనీ ఆరోపించింది. బలవంతంగా దోషిని చేసి విషం తాగించారు. మీరు ముందు మీ మనస్తత్వం మార్చుకోండి. అప్పుడు మీ భర్తలోని సానుకూల లక్షణాలు కనిపిస్తాయి. కాస్త విశ్లేషించి చూస్తే అతడు చదువుకున్నవాడు.. ఆలోచన శక్తి ఉన్నవాడని అర్ధమవుతోంది. ఇక చిన్న విషయానికే ఎందుకు కోపం తెచ్చుకుంటున్నాడో గమనించండి. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడండి. తల్లికి ప్రాముఖ్యం ఇస్తే లోపంగా కాకుండా, తల్లిని గౌరవించే వ్యక్తి అని సానుకూలంగా తీసుకోండి. మీ ప్రవర్తనతో అతడి మనసు గెల్చుకొని మీపై కూడా ఆధారపడేట్టు చేసుకోండి. మరో విషయం.. మీ భర్త మీరనుకున్న స్థాయికి మానసికంగా ఎదగలేదు అన్నది కాసేపు నిజమనుకుందాం. మరి ఆయన సాయంతో మీరు ఎదగాలనుకోవడం కూడా భావ్యం కాదు. ఎలాంటి ఆసరా లేకున్నా జీవితంతో ఉన్నతస్థాయికి చేరినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఉత్సాహం అనే మానసిక శక్తి మీకుంటే ఇంకొకరివైపు చూడాల్సిన అవసరం లేదు. బేలతనం మనిషిని కుంగదీస్తుంది. బలాన్ని మరుగున పడేలా చేస్తుంది. నన్ను నేను గెలిపించుకోవాలి అనే ఆరాటంతో ధైర్యంగా ముందుకెళితే ఒంటరిగా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకే వెంటనే ఆచరణ మొదలుపెట్టండి. రకరకాల ఆలోచనలతో కుంగిపోకుండా ముందుకెళ్లండి. చందమామపైన కాలు మోపి, అంతరిక్షాన్ని జయిస్తున్న మనిషికి సాధ్యం కానిదేదీ లేదు. ఈ సూత్రం మీకూ వర్తిస్తుంది.