సవ్యంగా సాగితే... డిజిటల్ హద్దులు చెరిపేస్తున్నారు

70% జంటలు అకౌంట్ పాస్వర్డులు, పిన్ నంబర్లు, పేట్రన్ లాక్‌లు, ఫింగర్‌ప్రింట్ సెన్సర్లను దాపరికం లేకుండా పంచుకుంటున్నారు. 11% ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన లాగిన్ వివరాలు సేవ్ చేసిన అకౌంట్లు, ఫోన్లను ఇరువురూ వాడేస్తున్నారు. 11% ఆఫీస్ వ్యవహారాలకు సంబంధించిన సమాచారంతో కూడిన అకౌంట్లు, డివైజ్‌లు (ఫోన్లు, ల్యాపీలు) యాక్సెస్ చేస్తున్నారు. 26% శాతం వ్యక్తిగత వివరాల్ని వారి ఫోన్లోనే కాకుండా భాగస్వామి డివైజ్‌ల్లోనూ (ఫోన్, ల్యాపీలు) స్టోర్ చేస్తున్నారు. దీంట్లో 14 శాతం మెసేజ్‌లు, 14 శాతం ఫొటోలు, 11 శాతం వీడియోలు ఉంటున్నాయి.
ఆధారం: కేస్పర్‌స్కీ సర్వే
|
అవగాహన అనివార్యం
డిజిటల్ ప్రపంచం ఇద్దరు వ్యక్తుల్ని దగ్గర చేసేందుకు ఎన్నో వేదికల్ని అందుబాటులోకి తెచ్చింది. అదే డిజిటల్ డేటా దూరమైనప్పుడు దుష్పరిణామాల్ని ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ తరహా ప్రైవసీ రిస్క్‌లను దరి చేరనివ్వకూడదనుకుంటే వ్యక్తిగత వివరాల్ని పంచుకునే ముందు కాస్త ఆలోచించండి. ఒకవేళ ఉచ్చులో చిక్కుకుంటే నిశితంగా డిజిటల్ డేటాని సమీక్షించుకోండి. ఊహించగలరు ‘అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. పంచుకున్నాం. ఇప్పుడు మార్చేస్తాం!’ అనుకునేవారు ఇంకాస్త లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే మీతో ఉన్న అనుబంధం కారణంగా వీడి వెళ్లినవారు అంత త్వరగా గతాన్ని మర్చిపోలేరు. మీరేం చేస్తున్నారో... తర్వాత జీవితాన్ని మీరెలా ప్లాన్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంట్లో భాగంగా మీ సోషల్ నెట్వర్క్ ఎకౌంట్లను యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు పాస్వర్డ్ మార్చినప్పటికీ వారికి తెలిసున్న లాగిన్ వివరాల ఆధారంగా తిరిగి మీరెలాంటి పాస్‌వర్డ్‌ని తిరిగి సెట్ చేయగలరో కూడా సులువుగా గ్రహించగలరు. గతంలో వాడిన పాస్‌వర్డ్‌లతో సంబంధం లేకుండా క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే మంచిది. వీటినీ మార్చేస్తూ ఉండాలి. ఓ కన్నేస్తుంటారు బ్రేక్అప్ అయినప్పటికీ ఇరువురూ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూనే ఉంటారు. అందుకు ఎంచుకునేది సోషల్ నెట్వర్కింగ్ వేదికలు. వాల్‌పై మీరేం పోస్ట్ చేస్తున్నారు.. మీరెవరితో సన్నిహితంగా ఉంటున్నారు... ఇలా అన్నీ చూస్తుంటారు. కొందరు తెలుసుకోవడంతోనే ఆగిపోరు. పోస్టింగ్‌లు, ఫొటోలను డౌన్లోడ్ చేస్తుంటారు. మీ మానసిక స్థితిని అంచనా వేస్తూ మీపై కక్ష సాధించే ప్రయత్నాలు మొదలు పెడతారు. డౌన్లోడ్ చేసిన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ పోర్న్ సైటుల్లో అప్లోడ్ చేసిన సంఘటనలూ అనేకం. ‘రీకాల్’ చేయండి ఈ-మెయిళ్లు వ్యక్తిగతమైనవి. చదువు, వృత్తి, ఉద్యోగ పరమైన అవసరాలకు వాడే ప్రధాన సాధనం అనుకోవచ్చు. కొందరు వ్యక్తులతో మీకున్న అనుబంధం కొన్నిసార్లు వ్యక్తిగత వేదికల్లోకి ఆహ్వానించేలా చేస్తుంది. ఎలాగంటే... కొన్ని డిజిటల్ వారధుల్లో కొన్నింటికి ‘ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్’ ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ లేదా గార్ల్ఫ్రెండ్ది ఎప్పుడో ఇచ్చుండొచ్చు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినా... వారికి గుర్తుండొచ్చు. దీంతో వారికి మీ అకౌంట్ లాగిన్ వివరాల్ని తెలుసుకోవడం చిటికెలో సాధ్యం అవుతుంది. క్లౌడ్ స్టోర్‌తో కష్టాలు క్లౌడ్ స్టోరేజ్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో... కొన్ని మెయిల్ సర్వీసులు ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్‌ని అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మెమొరీతో కూడిన ఫొటో ఆల్బమ్‌లను క్లౌడ్ డ్రైవ్‌ల నుంచి పంచుకుంటున్నాం. అయితే, బ్రేకప్ తర్వాత ఇలాంటి క్లౌడ్ సోర్సులతో ఇబ్బందులు ఎదరవ్వొచ్చు. అందుకే ఇలా పంచుకున్న డేటాని రివ్యూ చేసి యాక్సెస్‌ని బ్లాక్ చేస్తే మంచిది.
|
నమ్మకానికీ హద్దులు ఉంటాయి
సిటిజన్లు అంతా నెటిజన్లుగా మారుతున్న నేపథ్యంలో కచ్చితంగా నమ్మకానికి హద్దులు ఉంటాయి. ఈ విషయాన్ని టీనేజర్లు గ్రహించాలి. ఎందుకంటే... అంతా ఆన్లైన్ మయం. దీంతో మనసులోని ఊసులన్నీ టెక్స్ట్‌కి పరిమితం కాలేదు. సెల్ఫీలు, ఛాటింగ్‌లు, వీడియోలు... ఇంకా చాలానే. క్లౌడ్ సర్వీసులు వాటన్నింటినీ భద్రం చేస్తున్నాయి. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా ఈ లాగిన్ వివరాలు, పేట్రన్ లాక్‌లు, పిన్ నెంబర్లు, ఈ-మెయిళ్లు, సోషల్ అకౌంట్, డిస్కౌంట్ కూపన్ల వివరాలు ప్రస్తావనికి వస్తుంటాయ్. అవసరం మేరకు ఒకరివి.. మరొకరు వాడుకుంటూ అదో కల్మషం లేని రిలేషన్ అనుకుంటారు. వ్యక్తిగతమైంది ఏదైనా ఒక్కసారి నెట్టింటికి ఎక్కిందంటే దానిపై నియంత్రణ ఉండదు. డేటింగ్ పేరుతో నేడు ఆన్లైన్లో ఇచ్చిపుచ్చుకునేవి భవిష్యత్‌లో నొచ్చుకునేలా చేస్తాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. నమ్మకానికి హద్దులు ఉండాలి. బిల్లు కట్టేందుకు అకౌంట్ వివరాలు అడిగితే... నేను కడతా అమౌంట్ ఎంతో చెప్పమనండి! మొహమాటానికి ఇవ్వొద్దు నీ ఫోన్ ఇవ్వు వాడుకుంటా అంటే.. ‘ఐదు నిమిషాలు ఆగు ప్లీజ్... ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఇస్తా’ అని చెప్పండి. కళాత్మకంగా ‘నో’ చెప్పండి ‘నీ ల్యాప్‌టాప్‌ని వాడుకుంటా’నంటే... ‘యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తా’ అని చెప్పాలి. హుందాగా ప్రవర్తించండి. ఎందుకీ దాపరికాలంటే... ‘ఇరువురి ప్రైవసీ పాలసీలను గౌరవించుకుందాం’ అని హుందాగా చెప్పండి.
|
బెడిసికొడితే... డిజిటల్ హద్దులు దాటేస్తున్నారు

12% ఎక్స్-భాగస్వామి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తూ పగ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 21% ఆయా అకౌంట్‌ల్లోకి లాగిన్ అవుతూ ఎప్పటికప్పుడు వారి అప్డేట్స్ని తెలుసుకుంటున్నారు 12% యాక్సెస్ ఉన్న ఎకౌంట్లు, డివైజ్‌లు (ఫోన్, ల్యాపీలు) పనికి రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 10% ఆన్లైన్ అకౌంట్‌ల్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్ చెల్లింపులు చేసుకుని డబ్బు కాజేస్తున్నారు.
|