‘ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు’

తాజా వార్తలు

Published : 16/12/2020 01:48 IST

‘ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు’

హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ కోసం అన్ని శాఖల ఉద్యోగుల సేవలు అవసరమని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. మొదటిదశ వ్యాక్సిన్‌ అనంతరం నాలుగు వారాల తర్వాత వ్యాక్సిన్‌ రెండో డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తరఫు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆలోచన చేస్తున్నట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. అయితే ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని.. ప్రస్తుతం కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై ఎస్‌ఈసీ.. గవర్నర్‌ను కలవడంతో పాటు హైకోర్టునూ ఆశ్రయించారు. ఆ అంశంపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని