కేఆర్‌ఎంబీ సమావేశం రద్దు చేయాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 03/07/2021 22:21 IST

కేఆర్‌ఎంబీ సమావేశం రద్దు చేయాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: నీటిపారుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో వివిధ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ వైఖరిని సీఎం కేసీఆర్‌ తప్పుబట్టారు.

‘‘నీటి కేటాయింపులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు కడుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఎన్జీటీ స్టే విధించినప్పటికీ అక్రమంగా నిర్మిస్తోంది. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ కూడా అక్రమ ప్రాజెక్టే. జులై 9న నిర్వహించబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశాన్ని రద్దు చేయాలి. జులై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి. తెలంగాణ అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి. తెలంగాణ ఎజెండాను కేఆర్‌ఎంబీకి పంపాలి. ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించాలి. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. ఇరు రాష్ట్రాలకు మొత్తం 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపు. తెలంగాణ, ఆంధ్రా చెరో 405.5 టీఎంసీలు వాడుకోవాలి. చెరోసగం నీటిని ట్రైబ్యునల్‌ కేటాయించేంత వరకు వాడుకోవాలి.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగాలి. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్‌ఎంబీకి లేదు. జల విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాలు లేవు. విద్యుత్‌ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కృష్ణా జలాలు వృథా చేస్తున్నామనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవచ్చు. ప్రకాశం బ్యారేజికి వచ్చే నీటితో ఏపీ తమ అవసరాలు తీర్చుకోవాలి. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. 51 శాతం ‘క్లీన్‌ ఎనర్జీ’ని ఉత్పత్తి చేయాలని కేంద్రమే చెబుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైనది. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటితోనే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని చెరువులకు వదలాలి. శ్రీశైలం సహా కృష్ణా ప్రాజెక్టుల వద్ద పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని