‘చంద్రయాన్‌-2’కి ఏడాది

తాజా వార్తలు

Published : 22/08/2020 01:36 IST

‘చంద్రయాన్‌-2’కి ఏడాది

బెంగళూరు : భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఏడాదిని పూర్తి చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ విఫలమైననప్పటికీ.. చందమామ చుట్టూ ఆర్బిటర్‌ విజయవంతంగా పరిభ్రమిస్తోంది. దానిలో సరిపడా ఇంధనం ఉందని.. మరో ఏడేళ్లు సేవలు అందించడానికి ఇది సరిపోతుందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్‌-2 ప్రాజెక్టును భారత్‌ గత ఏడాది జులై 22న చేపట్టింది. ఇది చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 20న ప్రవేశించింది. ‘చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చివరి క్షణాల్లో విఫలమైంది. ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. ఇప్పటి వరకూ చందమామ చుట్టూ ఇది 4,400కుపైగా ప్రదక్షిణలు చేసింది.. అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నాయి’ అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ని మోసుకెళుతూ జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1 రాకెట్‌ 2019, జులై 22న నింగిలోకి దూసుకెళ్లింది. 45 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబరు 6-7 మధ్య రాత్రి ల్యాండింగ్‌కు సిద్ధమైంది. కానీ, సాంకేతిక కారణాలతో ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది లూనార్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టింది. దీంతో ల్యాండర్‌లోని భాగాలు దెబ్బతిని భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయింది.

ఇక చంద్రయాన్‌-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని