2-3 గంటల ముందే గమ్యానికి క్లోన్‌ రైళ్లు

తాజా వార్తలు

Published : 21/09/2020 01:05 IST

2-3 గంటల ముందే గమ్యానికి క్లోన్‌ రైళ్లు

దిల్లీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి 40 క్లోన్‌ (సమాంతర) రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. ఆయా మార్గాల్లో కొన్ని రైళ్లకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా అదే రైలు నంబర్‌తో ఈ రైళ్లు నడుస్తాయి. కొన్ని రైళ్లకు వెయింటింగ్‌ లిస్టు జాబితా పెరిగిపోవడంతో రైల్వే శాఖ నూతనంగా వీటిని తీసుకొచ్చింది. అయితే, అసలు రైలు కంటే క్లోన్‌ రైలే గమ్యస్థానానికి ముందుగా చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్ల వేగం ఎక్కువగా ఉండడం, పరిమిత హాల్ట్స్‌, అసలు రైలు కంటే ముందుగానే బయల్దేరడం వంటి కారణాలతో ఇవి దాదాపు 2-3 గంటల ముందుగానే అవి గమ్యానికి చేరుకుంటాయని వెల్లడించారు.

మొత్తం 20 జతల క్లోన్‌ రైళ్లు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి (సెప్టెంబర్‌ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా అధిక రద్దీ కలిగిన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఇందులో 19 జతల రైళ్లు 3ఏసీ కలిగిన 18 కోచ్‌లతో నడుస్తాయి. వీటిలో హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. లఖ్‌నవూ- దిల్లీ మధ్య నడిచే 22 కోచ్‌ల రైలుకు మాత్రం జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ రైళ్లకు 10 రోజుల ముందుగానే ఉదయం 9 గంటల నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని రైల్వే శాఖ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ రైళ్లలో ఎలాంటి డైనమిక్‌ ఛార్జీల విధానాన్ని అమలు చేయబోమని రైల్వే అధికారులు తెలిపారు. 2016లో రైల్వే శాఖ మంత్రిగా సురేశ్‌ ప్రభు ఉన్నప్పుడే ఈ క్లోన్‌ రైళ్ల విధానాన్ని రూపకల్పన చేసినప్పటికీ తగిన రైల్వే నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోవడంతో అది సాధ్యపడలేదు. 

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరు నుంచి దనాపూర్ (06509), దనాపూర్ నుంచి బెంగళూరు (06510)వెళ్లే రైళ్లు విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్‌ నుంచి దనాపూర్‌ (02787), దనాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ (02788) మధ్య కూడా ఈ క్లోన్‌ రైళ్లు నడవనున్నాయి. ఇవి బలార్షా, నాగ్‌పూర్‌, జబల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా వెళ్లనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని