ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ‘పంచ్‌’లు పేలుతున్నాయ్‌!

తాజా వార్తలు

Published : 29/10/2020 02:00 IST

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ‘పంచ్‌’లు పేలుతున్నాయ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పిస్తూనే.. ఉల్లంఘనులకు తగిన బుద్ధి చెబుతున్నారు. ఇందుకోసం బాగా పాపులర్‌ అయిన సినిమాల్లోని డైలాగ్‌లను, పంచ్‌లను ప్రయోగిస్తున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న ఇలాంటి పంచ్‌ డైలాగ్‌లు ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు ట్రాఫిక్‌ రూల్స్‌పైనా అవగాహన పెంచేందుకు మంచి సాధనంగా మారాయి. మనిషి ప్రాణాల విలువను తెలపడంతో పాటు వాహన చోదకులకు బాధ్యతనూ చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి పోలీసుల కళ్లుగప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా.. నిఘా నేత్రాలు (సీసీటీవీలు) పసిగడుతున్నాయి. అలాంటి వారి వాహనాల ఫొటోలను అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేసి షాక్‌ ఇస్తున్నారు. అలాగే, భారీ జరిమానాలతో గూబ గుయ్యిమనిపిస్తున్నారు. కొన్ని పంచ్‌లు మీరూ చూడండి..

తల్లి ప్రేమంటే ఇదా?

ఇదిగో ఈ ఫొటో చూశారా? నల్లగండ్ల - మియాపూర్‌ వద్ద పోలీస్‌ కెమెరాకు చిక్కింది. ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు. వెనక కూర్చున్న ఓ మహిళ ఫోన్‌ను అతడి చెవి వద్ద ఉంచారు. దీంతో ఆమెకు పోలీసులు సలహాతో కూడిన  హెచ్చరిక చేశారు. ‘అమ్మా... తల్లి ప్రేమ అంటే ఇట్ల కాదు.. పిల్లలకు సరైన బుద్ధి నేర్పాలి’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నేరానికి రూ.2335 జరిమానా విధించారు.


మీరు మేం కాపాడుకొనే ప్రాణాలు.. బాధ్యత ఉండక్కర్ల!

మాదాపూర్‌లోని ఐకియా వద్ద మద్యం సేవించి రోడ్డుపై పడుకున్న వ్యక్తిని సీసీటీవీలో గమనించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌తో ఈ ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘‘మీరంతా మేం కాపాడుకొనే ప్రాణాలు.. నువ్వేమో ఫుల్‌గా తాగేసి రోడ్డుపై బండి అడ్డంగా ఆపి పడుకున్నావ్‌.. బాధ్యత ఉండక్కర్ల?’’ అంటూ చీవాట్లు పెట్టారు. 


ఇదిగో ఇది మియాపూర్‌లోని నల్లగండ్ల వద్ద నిఘానేత్రానికి చిక్కిన ఫొటో.  ‘ఎన్నివేషాలో.. కానీ తప్పించుకోలేరు’ అని పేర్కొంటూ  పోలీసులు భారీగా జరిమానా విధించారు.


అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌
రాయదుర్గంలో తీగల వంతెనకు పర్యాటకుల తాకిడి పెరిగిన విషయం తెలిసిందే. అయితే, శని, ఆదివారాల్లోనే అధికారులు పర్యాటకులకు అనుమతిచ్చారు. మామూలు రోజుల్లో కేవలం వాహనాలకే తప్ప పర్యాటకులకు అనుమతి నిషిద్ధం. కానీ కొందరు మామూలు రోజుల్లోనూ సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో కింది వీడియోలోని ఓ ఫ్యామిలీని చూడండి.. ద్విచక్రవాహనంపై  వంతెన వద్దకు వచ్చి ఆగింది. అక్కడ ఫొటోలు దిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. నంబర్‌ ప్లేట్‌ కెమెరా కంట పడకుండా తన భార్య చున్నీ అడ్డుగా పెట్టాడు. ఫొటోలు దిగాలా.. వద్దా? అని కాసేపు అక్కడే తచ్చాడారు. ఈ లోపు పోలీస్‌ సైరన్‌ మోగడంతో అక్కడి నుంచి జారుకున్నారు. అయితే, వీరికి ఫొటో తీసుకోవడం కుదరకపోగా భారీ జరిమానా పడింది. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన పోలీసులు..  ‘అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’ అని ఇచ్చిన క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా,  ట్రిపుల్‌ రైడింగ్, హెల్మెట్‌ ధరించకపోవడం, ఉద్దేశపూర్వకంగా వాహన సమాచారాన్ని దాచే ప్రయత్నం చేయడంతో పోలీసులు రూ.2,135లు జరిమానా విధించారు.


ఇంకొన్ని..Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని