కాలుష్యానికి ‘గ్రీన్‌’ వార్నింగ్‌

తాజా వార్తలు

Published : 08/10/2020 19:49 IST

కాలుష్యానికి ‘గ్రీన్‌’ వార్నింగ్‌

దిల్లీ: శీతాకాలంలో కాలుష్య నియంత్రణ కోసం దిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ దిల్లీ సచివాలయం వద్ద ‘గ్రీన్‌ వార్‌ రూమ్‌’ను గురువారం ప్రారంభించారు. దీని ద్వారా శీతాకాలంలో నగరంలోని కాలుష్య స్థాయులను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం పదిమందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక కాలుష్య కారకాల స్థాయి, కాలుష్యాన్ని అరికట్టడం కోసం తీసుకుంటున్న చర్యలు, గ్రీన్‌ దిల్లీ యాప్‌ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్థితి వంటి వాటిని ఈ బృందం పర్యవేక్షిస్తుంది.

శాటిలైట్‌ డేటా ద్వారా పొరుగున ఉండే రాష్ట్రాలలో వ్యవసాయ సంబంధ వ్యర్థాల దహనం వంటి వాటినీ వార్‌ రూమ్ విశ్లేషిస్తుంది. దిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం వేర్వేరుగా శాఖలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ వార్‌ రూమ్‌ సమన్వయం చేస్తుందని గోపాల్‌ రాయ్‌ వివరించారు. దీని ద్వారా ధూళి కాలుష్యానికి కారణమయ్యే నిర్మాణాలు, కూల్చివేతలు జరిగే ప్రదేశాలు, రెడిమిక్స్ కాంక్రీట్‌ ప్లాంట్‌లు, వ్యర్థాలు దహనం చేసే ప్రదేశాలలో మార్గదర్శకాలు కఠినంగా అమలు అయ్యేలా చూస్తారు.

‘‘కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అక్టోబరు 15 వరకు ఓ మిషన్‌ లా కొనసాగిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటాం. నగరంలో 13 కాలుష్య హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. గ్రీన్‌ వార్‌ రూమ్‌ ద్వారా అక్కడ కాలుష్య నియంత్రణ కోసం పాటు పడతాం. స్వీకరించిన ఫిర్యాదులు, పరిష్కారాలకు సంబంధించిన రోజూవారీ నివేదికలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పంపిస్తాం’’ అని గోపాల్‌ రాయ్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని