దేశంలో కరోనా నిర్ధారణకు మరో విధానం

తాజా వార్తలు

Published : 24/10/2020 02:05 IST

దేశంలో కరోనా నిర్ధారణకు మరో విధానం

ఫెలూదా పరీక్షలకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన క్రిస్పర్‌ ఫెలూదా విధానం 96 శాతం కచ్చితత్వాన్ని, 98 శాతం విశిష్టతను కనబరిచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ ప్రకటించారు. ఈ ఫెలూదా పేపర్‌ స్ట్రిప్‌ పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ ఐసీఎంఆర్‌ జారీ చేసింది. ఈ పరీక్షా విధానం ప్రస్తుతం వాడుతున్న ఇతర పరీక్షలకు దీటుగా కచ్చితమైన, వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

ఏమిటీ ఫెలూదా పరీక్ష?

దిల్లీలో సీఎస్‌ఐఆర్‌ సంస్థకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ, టాటా గ్రూప్‌ సంయుక్తంగా ఈ విధానాన్ని  రూపొందించాయి. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే సృష్టించిన డిటెక్టివ్‌ పాత్ర ఫెలూదా పేరును ఈ పరీక్షకు పెట్టారు. ఈ విధానంలో  కొవిడ్-19 వైరస్‌ ఉనికిని గుర్తించేందుకు జీన్‌ ఎడిటింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తారు. గర్భ నిర్ధారణ పరీక్షకు ఉపయోగించే పట్టీ తరహాలో ఇది ఉంటుంది. సేకరించిన నమూనాలో కొవిడ్‌ వైరస్‌ ఉన్నప్పుడు దీని రంగు మారిపోతుంది. గంట కంటే తక్కువ వ్యవధిలో ఫలితాలను తెలియజేసే ఈ విధానంలో.. నిర్ధారణకు సుమారు రూ.500 ఖర్చవుతుందని అధికారులు అంటున్నారు. ఈ పరీక్షా విధానాన్ని దేశంలో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది.

మరోసారి నిర్ధారణ అవసరం లేదు

అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల్లో ఫెలూదా విధానం ద్వారా ఇకమీదట కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపవచ్చని ఐసీఎంఆర్‌ తెలిపింది. అంతేకాకుండా ఫెలూదా విధానాన్ని వాడేందుకు ఆయా సంస్థలు మరోమారు అనుమతులు పొందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విధానంలో కరోనా వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత.. సంప్రదాయ ఆర్‌టీ పీసీఆర్‌ విధానంలో మరోసారి నిర్ధారించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం ఫెలూదాతో సహా ఆర్‌టీ పీసీఆర్‌, ట్రూనాట్‌, సీబీనాట్‌ పరీక్షల ద్వారా నిర్ధారణ జరుగుతోంది. ల్యాబులు వీటిలో ఏ విధానాన్నైనా అనుసరించ వచ్చని.. ఐతే ఏ విధానం ద్వారా పరీక్ష జరిపినా సంబంధిత సమాచారాన్ని ఐసీఎంఆర్‌ కొవిడ్‌ 19 వెబ్‌ పోర్టల్‌లో పొందుపరచాలని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని