గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్‌

తాజా వార్తలు

Updated : 20/07/2020 12:53 IST

గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్‌

అమరావతి: ఏపీ హైకోర్టు ఆదేశాలతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను నిమ్మగడ్డ రమేశ్‌ కలిశారు. హైకోర్టు తీర్పును ఆయనకు వివరించారు. తనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలంటూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును గవర్నర్‌కు తెలియజేశానన్నారు. ‘‘ నా విజ్ఞాపనను గవర్నర్‌ సానుకూలంగా స్వీకరించారు. గవర్నర్‌ జోక్యంతో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని నిమ్మగడ్డ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని ఉన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

ఏం జరిగిందంటే?

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్‌ ప్రకటించింది. ఒకపక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నిర్వహిస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని, అందుకే ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆయన ప్రతిపక్షనేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారని, ఆ పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ముఖ్యమంత్రి జగన్‌తోపాటు మంత్రులు, వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మార్చి 18న ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయన  కొంతకాలం హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రమేశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ, హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై మూడు సార్లు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై గవర్నర్‌కు కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని