ఆ గ్రామంలో 300ఏళ్లుగా మద్య నిషేధం!

తాజా వార్తలు

Published : 11/10/2020 10:21 IST

ఆ గ్రామంలో 300ఏళ్లుగా మద్య నిషేధం!

అనంతపురం: ఈరోజుల్లో మద్యం దొరకని పల్లెలు లేవంటే అతిశయోక్తి కాదు. కానీ ఒక గ్రామం మాత్రం మద్యాన్ని తమ ఊరి పొలిమేరలోకి రానివ్వదు. 300 ఏళ్ల క్రితం పెద్దలు చెప్పిన మాటకు కట్టుబడి నేటికీ దాన్ని ఆచరిస్తున్నారు. అంతేకాదు కోడి మాంసం, కోడిగుడ్లను సైతం ఈ గ్రామస్థులు తినరు. మద్యానికి, చికెన్‌కు దూరంగా ఉన్న ఆ పల్లె అనంతపురం జిల్లాలో ఉంది. 
అనంతపురం జిల్లాలో చిన్న గ్రామం అడిగుప్ప. రాయదుర్గానికి 10 కిలోమీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండలంలో ఉంది. ఇక్కడ 100 వరకు కుటుంబాలు ఉండగా సుమారు 600 మంది జనాభా నివసిస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా బోయ వర్గానికి చెందినవారు. ఇక్కడ సుమారు 300 ఏళ్లుగా మద్య నిషేధం అమల్లో ఉంది. అంతేకాదు ఇక్కడివారు కోడి మాంసం, గుడ్డు కూడా తినరు. ఇక్కడి గ్రామస్థులు ఇంతటి కఠిన నియమం పాటించడం వెనక ఒక చరిత్ర ఉంది.

సుమారు మూడు శతాబ్దాల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లినప్పుడు చిత్రదుర్గానికి చెందిన రాజు ఇక్కడున్న సంపద దోచుకునేందుకు వ్యూహం పన్నాడు. ప్రజలకు మద్యం, కోడి మాంసం తినిపించి అంతా మత్తులో ఉండగా దోపిడీకి యత్నించాడు. విషయం గ్రహించిన రాజు తిరిగి వచ్చి వారితో పోరాడి సంపదను రక్షించుకున్నాడు. శత్రువులు ఇంత సాహసానికి యత్నించడానికి కారణమైన మద్యం, మాంసం ఇకపై తినబోమని ప్రజలందరితో ప్రమాణం చేయించుకుంటాడు. నాటి నుంచి నేటి వరకు గ్రామంలో ఇదే నిబంధన కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నిబంధనే గ్రామాన్ని క్రమశిక్షణ, ప్రశాంతత వైపు నడిపించింది. ఏ విషయంలోనైనా గ్రామస్థులంతా ఒకటిగా ఉంటారు. ఏవైనా విభేదాలు వస్తే గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. ఇక్కడున్న ప్రాథమిక పాఠశాలలోనూ గ్రామ నిబంధన పాటిస్తామని ప్రధానోపాధ్యాయుడు తిప్పేస్వామి చెబుతున్నారు. 3 శతాబ్దాల పాటు ఒక మాటకు కట్టుబడి ఈ ఊరి ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని