నవ వైకుంఠం.. యాదాద్రిక్షేత్రం..!

తాజా వార్తలు

Published : 25/12/2020 21:37 IST

నవ వైకుంఠం.. యాదాద్రిక్షేత్రం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జగం మెచ్చేలా జనం నచ్చేలా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి రూపుదిద్దుకుంటోంది. కృష్ణ శిలలతో ఉట్టిపడుతోన్న క్షేత్రం శిల్ప శోభితంగా కళ్లకు కడుతోంది. పంచనారసింహులు కొలువైన ప్రధానాలయం సప్తగోపురాలతో అలరారుతోంది. మాడ వీధులు, ప్రాకారాలు, ఆళ్వారుల విగ్రహాలతో దివ్యదేశాలను ప్రతిబింబించే దైవ సన్నిధిగా యాదాద్రి నిలిచిపోనుంది. ప్రధానాలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. అనుబంధంగా నిర్మిస్తోన్న శివాలయం తుది దశకు చేరుకుంది. యాదాద్రి ఉత్తరాన ప్రెసిడెన్షియల్‌ సూట్ల నిర్మాణాలు సాగుతున్నాయి. 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో పదిహేను విల్లాలూ నిర్మిస్తున్నారు. పనులు చివరి దశలో ఉన్న వేళ వివరాలు మీకోసం...!

కాకతీయుల కాలానంతరం సిమెంటు, ఇటుక, సున్నం లేకుండా కేవలం కృష్ణశిలతోనే నారసింహక్షేత్రం రూపుదిద్దుకుంది. రేయింబవళ్లు కష్టపడిన స్తపతులు రెండు లక్షల టన్నుల రాళ్లను అద్భుత శిల్పాలుగా మలిచారు. ఆగమ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం ప్రకారం... 2.33 ఎకరాల విస్తీర్ణంలో స్వయంభువుల సన్నిధి నిర్మితమవుతోంది. మాడవీధులు, ప్రాకారాలతో కలిపి 4.37 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం సిద్ధమవుతోంది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్ నిర్మాణ పనులు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభం అయ్యాయి. 2016 అక్టోబరు 11న.. ముఖ్యమంత్రి పనులకు అంకురార్పణ చేశారు. ఇప్పటివరకు వివిధ నిర్మాణాలకు రూ.780 కోట్లు ఖర్చు చేశారు. షిర్డీ, అక్షర్‌ధామ్‌ తరహాలో ఇత్తడి పైపులతో క్యూలైన్లు, ఆలయ కొండకు ఉత్తర దిశలో మందిరం ఆకారంలో బస్‌బే ప్రత్యేక శోభ ఆపాదించనున్నాయి. సప్తగోపురాలు, ఆళ్వారులతో కూడిన గర్భాలయం, మహాముఖ మండపం, దివ్య విమానం పూర్తయింది. ప్రధానాలయానికి రెండు ప్రాకారాలతో పాటు నలువైపులా సాలహారాలలో దివ్యదేశాలుగా సంభోదించే వైష్ణవ ఆలయాలు, దశవతారాలు, నారాసింహుడి రూపాలను పొందుపరచనున్నారు. 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉండే ద్వారాలను గర్భాలయానికి అమర్చారు. వీటికి బంగారు తాపడం చేసే పనులు మొదలు కావాల్సి ఉంది. మహాముఖ మండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉపాలయాలు ఇప్పటికే సంపూర్ణమయ్యాయి.

గర్భాలయ ప్రవేశ ద్వారంపైన శంఖు, చక్ర నామాలతో పాటు భక్తులను స్వాగతించేలా గరుడాళ్వారులు, ఆంజనేయస్వామి విగ్రహాలను పొందుపరిచారు. ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో రాతిగోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్ర, తొలి ప్రాకారంలో లోపలివైపు సింహాకారంతో కూడిన యాలి విగ్రహాలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన పనులను పూర్తిచేసిన వైటీడీఏ మహా కుంభాభిషేకం కోసం సన్నద్ధం అవుతోంది.

ప్రధానాలయానికి పడమటి దిశలో ఉన్న పెద్దగుట్టపై 850 ఎకరాల్లో ఆలయ నగరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 250 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. విశాలమైన రహదారులతో పాటు 30 ఎకరాలు పచ్చదనానికి కేటాయించారు. అభివృద్ధి చేసిన లే అవుట్‌లలో దాతల సహకారంతో విల్లాలను నిర్మించాలా లేక కాటేజీలు రూపొందించాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక ప్రధానాలయ కొండచుట్టూ రూ.120 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర బాహ్యవలయ రహదారీ తయారవుతోంది. బ్రహ్మోత్సవాల వంటి వేడుకల్లో మండప ప్రాకారంలోనే నాలుగు వేలమంది సేదతీరేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కొండకు దక్షిణ దిశతో పాటు చుట్టూ పలు వరుసల్లో పచ్చదనం పెంపొందిస్తున్నారు. ప్రధానాలయం బయట 80 శాతం వరకు ఫ్లోరింగ్ పనులు పూర్తికాగా ఆలయ నిర్మాణానికి ఇప్పటికే రూ.160 కోట్లు వెచ్చించారు. మరో రూ.40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉందని వైటీడీఏ అధికారులు చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని