తీవ్ర వాయుగుండంతో కోస్తాంధ్ర అతలాకుతలం

తాజా వార్తలు

Updated : 13/10/2020 17:17 IST

తీవ్ర వాయుగుండంతో కోస్తాంధ్ర అతలాకుతలం

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, కృష్ణా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తీరం వెంబడి గంటకు 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ ఉదయం 6.30గంటల నుంచి 7.30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున సముద్రంలోకి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వచ్చే ఐదారు గంటలపాటు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపే సూచనలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది భూభాగంపైకి రావడంతో పశ్చిమగోదావరి, కృష్ణ, తెలంగాణ జిల్లాల్లో విస్తృత ప్రభావం చూపుతోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొంతమేర వర్ష ప్రభావం తగ్గినట్లు అధికారులు తెలియజేశారు. 

వణికిపోయిన తీర ప్రాంతాలు

వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో కొంతమేర వర్ష ప్రభావం తగ్గింది. జనజీవనానికి కాస్త ఊరట దొరికింది. వర్షాలతో రాజమహేంద్రవరంలోని కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటిపల్లి బస్టాండ్‌, ఐఎల్‌టీడీ జంక్షన్‌, కంబాల చెరువు, రైల్వేస్టేషన్‌ రోడ్డు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. బొమ్మూరులో గోడ కూలి ఓ మహిళ మృతి చెందారు. తునిలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోటనందూరు, కొట్టాం, తుని, కొలిమేరు రోడ్లపై నీరు చేరింది. పూరిళ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వర్షం కారణంగా రావులపాలెం బస్టాండ్‌ చెరువును తలపిస్తోంది. కాకినాడ, ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో కొన్ని ఇళ్లు కోతకు గురయ్యాయి. జగ్గంపేటలో ఎస్సీ కాలనీని నీరు చుట్టుముట్టింది. మురుగుకాల్వల నీరు రోడ్లపైకి చేరి అస్తవ్యస్తంగా మారింది.

వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు
పశ్చిమగోదారివరిపైనా తీవ్రవాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. జంగారెడ్డి గూడెం, బుట్టాయగూడెం, టీ నర్సాపురం, తడిగెలపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, కొవ్వూరు, పోలవరం మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డి గూడెం మండలం పట్టన్నపాలెంలో జల్లేరువాగు పొంగి ప్రవహిస్తోంది. బైనేరు, సుద్దవాగు, ఎర్రకాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఎర్రకాలువ జలాశయం నుంచి 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వరి, పొగాకు నారు మళ్లు దెబ్బతిన్నాయి. తడికెల పూడిలో చేపల వేటకు వెళ్లి వాగులో పడి 55 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యారు.


 

పాములు, విషపురుగులతో భయం భయం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాట్రాయి మండలంలో కురిసిన భారీ వర్షాలకు రహదారులపై వరద ప్రవహిస్తోంది. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. తిరువూరులో లోతట్టు ప్రాంతాలు, నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి. బాపులపాడు మండలం కొత్తపల్లిలో ప్రధాన రహదారులు జలదిగ్బంధమయ్యాయి. నూజివీడు మండలం యనమదలో మోకాళ్ల లోతు నీరు చేరింది. వరదతో విషపురుగులు, పాములు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో భారీ వర్షం కురిసింది. వర్షపునీటితో 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది. విజయవాడ శివారు రాజీవ్‌నగర్‌ కట్ట సమీపంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీపంలోని బుడమేరు కాల్వ పొంగడంతో వరదనీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశ్‌నగర్‌, ఎల్వీఎస్‌నగర్‌లో రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. బుడమేరు వరద తగ్గితేనే మోటార్లు పెట్టి నీరు తోడుతామని అధికారులు చెబుతున్నారు.


 

విశాఖలో కొట్టుకొచ్చిన నౌక

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వ‌ర్షాలకు వాగులు వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని శార‌ద‌, వరాహ‌, తాండ‌వ నదుల్లోకి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ప్రవాహ ఉద్ధృతికి పాయ‌క‌రావుపేట‌, యల‌మంచిలిలోని కొన్ని లోత‌ట్టు  ప్రాంతాలు నీట‌మునిగాయి. తీర ప్రాంతంలో జాలర్ల బోట్లు ఒడ్డుకు కొట్టుకువ‌చ్చాయి. విశాఖ‌లో బంగ్లాదేశ్‌కి చెందిన వాణిజ్య ఓడ యాంక‌ర్లు కొల్పోయి అర్ధరాత్రి విశాఖ‌న‌గ‌రంలోని తెన్నేటి పార్కు స‌మీపానికి కొట్టుకొచ్చింది. దీనిని మ‌ళ్లీ స‌ముద్రంలోకి పంపేందుకు కొస్ట్ గార్డు రంగంలోకి దిగింది. జిల్లాలోని సాగ‌ర‌తీరమంతా అల్లకల్లోలం కావ‌డంతో ప‌లు నాటు ప‌డ‌వలు ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చాయి. తాండవ నదిలో పెరిగిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండవ రిజ‌ర్వాయరు నుంచి న‌దిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరం ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.

చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండి
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని