ప్రకృతి నిలయం.. భైరవకోన ఆలయం

తాజా వార్తలు

Updated : 25/11/2020 09:43 IST

ప్రకృతి నిలయం.. భైరవకోన ఆలయం

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గలగల సవ్వడులు చేసే జలపాతాలు... వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. సూర్యకిరణాలు సైతం భూమిని తాకలేనంతటి దట్టమైన అటవీ ప్రాంతం... అలాంటి చోట కొలువైన శ్రీ త్రిముఖ దుర్గాభైరవేశ్వరుడి దర్శనం. ప్రకృతి పులకింత, ఆధ్యాత్మిక పరవశం కలిగించే ఆ ప్రాంతమే భైరవకోన. మరి ఈ ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే....!

ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లిలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న విశిష్ట క్షేత్రమే భైరవకోన. ఏడో శతాబ్దానికి చెందిన పల్లవులు, చోళులు ఈ క్షేత్రాన్ని నిర్మించగా, తరువాతి కాలంలో ఉదయగిరి రాజులు ఇక్కడి దుర్గాభైరవేశ్వరుడికి విశిష్ట పూజలు చేసేవారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ గర్భగుడి, వరండాలు, స్తంభాలు అన్నింటినీ ఒకే కొండరాయిపై మలచటం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భైరవకోన చుట్టుపక్కల కొండల్లో కోటిన్నొక్క శివలింగాలు, చుట్టూ ఇరవైఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూటొక్క కోనేర్లు ఉన్నాయని చరిత్ర కారులు చెబుతారు. 

కాలభైరవుడి పేరుమీదుగా..
కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని భైరవ కోనగా పిలుస్తారని ప్రతీతి. ఇక్కడి ఆలయంలోని అమ్మవారు మూడు ముఖాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. శివుడు ఎనిమిది రూపాల్లో దర్శనమిస్తాడు. శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరీ, కేశ్వర, వర్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జునుడిగా స్వామివారు ఆధ్యాత్మిక పరవశం కలిగిస్తాడు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఈ ప్రాంతానికీ కార్తిక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కార్తిక పౌర్ణమి రోజున నిండు చంద్రుడి కిరణాలు ఆలయం పక్కన ప్రవహిస్తున్న నీటిపై పడి అమ్మవారిపై ప్రతిబింబించటం అద్భుతమని భక్తులు అంటున్నారు.

కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో భైరవకోన అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతాలు, కోనేర్ల వద్ద సందర్శకులు సేదతీరుతున్నారు. దైవదర్శనంతో పాటు, ప్రకృతి అందాలను చూసి పులకించి పోవటానికి అనువుగా ఉన్న ఈ ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని