Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 20/10/2021 17:06 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతి

తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని.. గురుకులాల పునఃప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. గురుకులాలు తెరవొద్దని గతంలో ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతా పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

2. రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు: వైఎస్‌ షర్మిల

దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్‌.. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర సంక్షేమ పాలనకు పునాది వేసిందని షర్మిల చెప్పారు. చేవెళ్ల నుంచి ఆమె ఇవాళ చేపట్టనున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.

3. ధ్వంసమైన సామగ్రి మధ్యే చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా నిరసన దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్య చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.

లోకేశ్‌ సహా తెదేపా నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు

4. సీఎం జగన్‌ను.. పట్టాభి అనకూడని మాట అన్నారు: సజ్జల

 తెదేపా నేతలు పరుష పదజాలం వాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కావాలనే మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారు. వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక తెదేపా నేతలు ఇలా మాట్లాడుతున్నారు’’ అని సజ్జల ఆరోపించారు.

5. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తారా?: బండి 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేతపై అధికార పార్టీ తెరాస అబద్ధాలు చెప్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

6. చైనాలో కూలుతున్న ‘రియల్‌’ సౌధం..

చైనా స్థిరాస్తి రంగంలో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఆ దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఎవర్‌గ్రాండె బాండ్లు, రుణాలను చెల్లించలేనని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో కంపెనీ ఫాంటాసియా కూడా బాండ్లకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పట్లో ఈ సంక్షోభం గట్టెక్కే సూచనలు కనిపించడంలేదు. తాజాగా మరో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో చైనా రియల్‌ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రంప్‌లో క్యాపిటల్‌ కలవరం

7. టీ20 ప్రపంచకప్‌ ముందు ఎవరెలా ఉన్నారంటే..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో టీమ్‌ఇండియా తొలి విజేత. తర్వాత మరో పొట్టి కప్పు సాధించాలని చూసినా కుదరలేదు. 2014లో ఆ అవకాశం దక్కినా ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలై త్రుటిలో ఆ సువర్ణ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో అప్పటి నుంచి మరో ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కల అలాగే ఉండిపోయింది. చివరిసారి 2016లో ఫేవరెట్‌గా బరిలోకి దిగినా టీమ్‌ఇండియా సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆపై వివిధ కారణాలతో ఐదేళ్లుగా ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు వీలుకాలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారైనా కప్పు గెలవాలని అటు ‘కోహ్లీసేన’ ఇటు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

8. కోర్టుకెళ్లిన సమంత.. యూట్యూబ్‌ ఛానళ్లపై పరువు నష్టం దావా
తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు.

9. మనిషికి పంది కిడ్నీ.. ఆపరేషన్‌ సక్సెస్‌

వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

10. ఆర్యన్‌కు మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. బుధవారం ముంబయి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని అతడి తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టుకు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని