రాజమహేంద్రవరానికి ఆ గుర్తింపు దక్కేదెప్పుడో!

తాజా వార్తలు

Updated : 05/11/2020 12:42 IST

రాజమహేంద్రవరానికి ఆ గుర్తింపు దక్కేదెప్పుడో!


ఇంటర్నెట్‌ డెస్క్‌ : రాజమహేంద్రవరం...!  గోదావరి నదీ తీరంలో అలరారుతున్న ఆ నగరం...ఆంధ్రుల చారిత్రక, వారసత్వ సంపదకు నిలయం. ఆ నగరానికి ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ తదితర అంశాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కు సాంస్కృతిక రాజధానిగా కూడా ఈ నగరం విరాజిల్లుతోంది. ఎన్నో ఆధ్యాత్మిక సందర్శనీయ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్ని విశేషాలను కలిగి ఉన్నప్పటికీ.. వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోవటం లేదు. 

ఎన్నో శతాబ్దాల చరిత్ర...
రాజమహేంద్రవరానికి ఎన్నో శతబ్దాల చరిత్ర ఉంది. రాజరాజ నరేంద్రుడు దీనిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. వేంగీ చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంపాదించిందీ నగరం. కాకతీయ సామ్రాజ్యంలోనూ రాజమహేంద్రీ... ప్రాశస్త్యం పొందింది. రెడ్డి రాజులు, గజపతులు బహమనీ సుల్తానులు, విజయనగర రాజుల పాలనలో ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. కవిత్రయంలో మొదటి వారైన నన్నయ్య, ఆధునిక వైతాళికుడు కందుకూరి వీరేశలింగం ఇక్కడి వారే..! ఎంతో మంది కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలకు ఈ నగరం నెలవైంది.

కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం...
వారసత్వ గుర్తింపుతో పాటు, నగర ప్రాశస్త్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కింద ఉన్నప్పుడు కూడా ఈ నగరం సాంస్కృతిక రాజధానిగా ఉండేదని వారంటున్నారు. రాళ్లబండ సుబ్బారావు మ్యూజియం, దామెర్ల రామారావు ఆర్ట్‌ గ్యాలరీ, ఇస్కాన్‌ దేవాలయం, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మ్యూజియం తదితరాలెన్నో ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తామన్నారు. వారసత్వ నగరంగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తామని ఎంపీ భరత్‌ తెలిపారు. ఈ నగరం పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధంగా కార్యచరణ చేపడతామని వివరించారు. నగర ప్రాముఖ్యతను, వారసత్వ సంపదను ఓ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వారసత్వ నగరంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని పురావస్తు శాఖ కమిషనర్‌ వాణీ మోహన్‌ వివరించారు.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని