పదోతరగతికి యూట్యూబ్ పాఠాలు! 
close

తాజా వార్తలు

Published : 01/12/2020 00:17 IST

పదోతరగతికి యూట్యూబ్ పాఠాలు! 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా దృష్ట్యా రాష్ట్రంలో ఇప్పటి వరకూ పాఠశాలలు తెరుచుకోలేదు. ఈ కారణంగా విద్యార్థులు నష్టపోవద్దని ప్రభుత్వం భావించింది. టీశాట్, దూరదర్శన్‌ల ద్వారా బోధనను ప్రారంభించింది. కానీ అందులో ఎన్నో రకాల సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. క్లాసులు వింటున్నప్పుడు కరెంట్ పోవటం, కొన్ని సందర్భాలలో అర్థం కాకపోవటం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌ అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులకు యూట్యూబ్‌ సాయంతో పాఠాలు చెప్పించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

స్థానిక ఉపాధ్యాయులతో...
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 221 ప్రభుత్వ పాఠశాలల్లో 8,200 మంది పదోతరగతి విద్యార్థులు ఉండగా, అందులో 5,700 మందికి చరవాణులు అందుబాటులో ఉన్నాయి. సెల్‌ఫోన్‌ లేని విద్యార్థులను ఇతరులతో మ్యాపింగ్‌ చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది విద్యార్థులు యూట్యూబ్‌ పాఠాలు వింటున్నట్లు గుర్తించారు. జిల్లాలోని 25 మంది ఉపాధ్యాయుల ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నాం..గంటపాటు మూడు తరగతులు చెప్పిస్తున్నారు. అర్థం కానీ అంశాల గురించి విద్యార్థులు వాట్సప్‌ గ్రూప్‌లో వెల్లడించినపుడు సందేహాలను నివృత్తి చేస్తున్నారు. స్థానిక ఉపాధ్యాయులు కావటం, పాఠ్యాంశాలను వరుస క్రమంలో వివరిస్తుండటంతో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

ఎన్నిసార్లయినా..ఎప్పుడైనా!
‘‘యూట్యూబ్‌ ద్వారా లైవ్‌ తరగతులను ప్రసారం చేస్తున్నాం. దీనికి సంబంధించిన లింక్‌ను ముందురోజే ప్రధానోపాధ్యాయులకు, వారిని నుంచి విద్యార్థులకు షేర్ చేస్తాం. ప్రతిరోజు క్లాస్‌ సమయంలో ఆ లింక్‌ను క్లిక్‌ చేయటం ద్వారా విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఒకవేళ మొబైల్‌ అందుబాటులో లేకపోయినా తరువాత కూడా లింక్‌ ద్వారా పాఠాలు వినవచ్చు. అర్థం కాకపోతే ఎన్నిసార్లయినా మళ్లీ, మళ్లీ  వినవచ్చు. అదే టీశాట్, దూరదర్శన్‌ అయితే మళ్లీ చూడటానికి అవకాశం ఉండదు. అంతే కాకుండా ఈ జిల్లా ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఆసక్తి చూపుతారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం’’ అని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎంతో ఉపయోగకరం...
యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు పాటలు వింటున్నామని, చాలా బాగుందని విద్యార్థులు అంటున్నారు. నెట్‌ సిగ్నల్‌ లేనప్పుడు మాత్రమే కొంత ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. పాఠాలు వినటం గురించి ఉపాధ్యాయులు అప్పుడప్పుడు ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నట్లు వివరించారు. యూట్యూబ్‌ క్లాసులు విజయవంతం కావటంతో చిన్న తరగతుల విద్యార్థులకు కూడా ఈ విధంగా పాఠాలు చెప్పేందుకు కృషిచేస్తున్నట్లు అధికారులు వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని