Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/09/2021 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. 35 రోజుల టికెట్లు.. 30 నిమిషాల్లోనే హుష్‌!

శ్రీవారి సర్వదర్శనం అక్టోబర్‌ నెల కోటా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా.. ఊహించని రీతిలో అరగంటలోపే అవి ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని జియో సహకారంతో ఆ సంస్థ సర్వర్లను వినియోగించి టికెట్లను విడుదల చేశారు.

2. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం..

బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కి 510 కి.మీ తూర్పు ఆగ్నేయ దిశలో.. కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. ఈ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం
అధిక ధర పలికిన పులస చేప

3. ఈ రంగాల్లో భాగస్వామ్యం.. భారత్‌-అమెరికా బంధానికి మరింత బలం!

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తొలిసారి ముఖాముఖీ భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. అనేక అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా భారతీయుల అగ్రరాజ్య ప్రవేశానికి వారధిగా ఉన్న హెచ్‌-1బీ వీసాపై చర్చించారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ఆ దేశ సామాజిక భద్రతకు తోడ్పాటునందిస్తున్నారని గుర్తుచేశారు. ఇరు నేతల సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఈ విషయాలను వెల్లడించారు. దీనిపై వెంటనే స్పందించిన శ్వేతసౌధం.. 2021లో ఇప్పటి వరకు భారత విద్యార్థులకు 62 వేల వీసాలు జారీ చేసినట్లు గుర్తుచేసింది.

4. పాక్‌ విధానాలు యావత్‌ ప్రపంచానికి ముప్పు!

ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌ దుర్నీతి వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు జవాబిస్తూ భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘పాకిస్థాన్‌ ప్రధాని భారత అంతర్గత విషయాలను ప్రస్తావించారు. తద్వారా ఈ వేదిక ప్రతిష్ఠను తగ్గించారు. ఈ క్రమంలో వారికి బదులిచ్చే హక్కును వినియోగించుకుంటున్నామని చెప్పారు.

5. మరో 6-8 వారాలు జాగ్రత్త..

కరోనా మహమ్మారి విషయంలో వచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే.. మనం దీన్నుంచి బయటపడి కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులకు వెళ్లొచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. దిల్లీలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మహమ్మారి పూర్తిగా పోలేదని, అందువల్ల ప్రజలు రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కొవిడ్‌ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు.

6. ఇసుక తుపాను కారణంగా కోహ్లీ, ధోనీ ముచ్చట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టాస్‌ వేసేందుకు షార్జా మైదానంలోకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇసుక తుపాను చెలరేగడంతో అంపైర్లు టాస్‌ను కొంతసేపు ఆలస్యం చేశారు. దీంతో కోహ్లీ, ధోనీ.. సరదా కబుర్లు చెప్పుకొనేందుకు మంచి సమయం దొరికింది. ఈ క్రమంలోనే ఇద్దరు కెప్టెన్లు ముచ్చటించుకుంటున్న వీడియోను ఐపీఎల్‌ నిర్వహకులు ట్విటర్‌లో పోస్టు చేశారు. 

7. మా ఎన్నికలు.. బండ్ల గణేశ్‌ వినూత్న ప్రచారం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండటంతో అందరి చూపు సిని‘మా’ పరిశ్రమపైనే ఉంది. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న బండ్ల గణేశ్‌ వినూత్న ప్రచారానికి తెర తీశారు. ట్విటర్‌ వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసిన ఆయన ‘ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం’ అని పేర్కొన్నారు.

8. మహిళా కానిస్టేబుళ్ల పని గంటల తగ్గింపు

ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. వృత్తి జీవితాన్ని, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని నాగ్‌పుర్, అమరావతి నగరాలతోపాటు పుణె గ్రామీణ విభాగంలో గత నెల ప్రయోగాత్మకంగా అమలుచేసిన ఈ నూతన విధానాన్ని రాష్ట్రమంతా పాటించేలా డీజీపీ సంజయ్‌ పాండే ఆమోదం తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్నప్పటికీ మహిళా కానిస్టేబుళ్లకు ఇంటిపరంగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి.

9. టూ-వీల‌ర్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? 

కొవిడ్‌-19 ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆరోగ్యానికి ప్రాముఖ్య‌త ఇస్తున్నారు. కోవిడ్ భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌లో భాగంగా మాస్క్ ధ‌రించ‌డం, స‌మాజిక దూరం పాటించ‌డం అనివార్యం అయ్యింది. దీంతో ఖ‌ర్చు పెరుగుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌లో కంటే సొంత వాహ‌నాల‌లో ప్ర‌యాణించేందుకే ప్ర‌జ‌లు మ‌గ్గుచూపుతున్నారు. రోజువారి ప‌నుల నిమిప్తం బ‌య‌ట‌కు వెళ్లేవారు, కార్యాల‌యాల‌కు వెళ్లే ఉద్యోగులు టూ-వీల‌ర్ కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. కారణం ఫోర్ వీల‌ర్‌తో పోలిస్తే టూ-వీల‌ర్ నిర్వ‌హణ ఖ‌ర్చు త‌క్కువ‌. 

10. కళాశాలలో ఘర్షణ.. విద్యార్థిని భవనం పైనుంచి తోసేసిన మరో విద్యార్థి

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నేపల్లి శివారు బిట్స్‌ కళాశాలలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్న సంజయ్‌ను మరో విద్యార్థి భవనంపై నుంచి తోసేయడంతో కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొడవకు గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పరీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని