Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 23/09/2021 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. MAA Elections: ‘మా’ ఎన్నికలు.. మంచు విష్ణు ప్యానల్‌ ఇదే..!

అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న తరుణంలో గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు బరిలోకి దిగుతుండగా.. ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్‌.. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు.. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్‌ పోటీచేస్తున్నారు. ట్రెజరర్‌గా శివబాలాజీ.. జాయింట్‌ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్‌ రాజు పోటీలో నిలబడ్డారు.

2. India corona: కొత్త కేసులు, రికవరీలు.. 31 వేలే

దేశంలో కరోనా కేసులు మళ్లీ 30 వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర పెరిగాయి. ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

3. NEET Scam: ‘రూ.50లక్షలిస్తే.. మీ పరీక్ష మేం రాసి సీటు ఇప్పిస్తాం..!’

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో భారీ కుంభకోణం బయటపడింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ మహారాష్ట్రకు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.50లక్షలు డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 

4. Pegasus: పెగాసస్‌పై విచారణకు ‘సుప్రీం’ కమిటీ.. వచ్చేవారం ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గురువారం వెల్లడించారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

5. AP News: ఏయూలో అమెరికన్‌ కార్నర్‌.. ప్రారంభించిన సీఎం జగన్‌ 

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటైంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్ జనరల్‌, మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి, యునివర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. దేశంలో అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తర్వాత విశాఖపట్నంలోనే అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్‌ అన్నారు. 

6. UK: కొవిషీల్డ్‌ ఓకే కానీ.. టీకా సర్టిఫికేట్‌కు కనీస ప్రమాణాలుండాలి..!

భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని చెబుతోన్న బ్రిటన్‌ ప్రభుత్వం.. తాజాగా టీకా ధ్రువీకరణ పత్రాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశాలు జారీ టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

7. ‘కరోనా తగ్గిందిగా.. అలా వెళ్లొద్దాం’.. విదేశీ టూర్లపై భారతీయుల చూపు

‘కరోనా’ ముప్పు, ఆంక్షలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు సిద్ధపడుతున్నారు. రవాణా ఆంక్షలు అంతగా లేని దేశాలను ఎంచుకుని, కాస్త సరదాగా గడిపి వద్దాం అనుకుంటూ బయలుదేరుతున్నారు. దేశీయ పర్యాటకుల్లో దాదాపు 85 శాతం మంది సమీప భవిష్యత్తులో ఏదో ఒక దేశానికి వెళ్లి రావాలనుకుంటున్నట్లు ‘మేక్‌మై ట్రిప్‌’ అనే పర్యాటక సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

8. Work from home: ‘ఆఫీసు వద్దు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమే ముద్దు’.. కంపెనీలకు కొత్త బెడద!

కరోనా ముప్పు అప్పుడే ముగిసిపోలేదు. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కష్టాలు తప్పవని కేంద్రంతో పాటు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నీతి ఆయోగ్, ఎస్‌బీఐ లాంటి సంస్థల అధ్యయనాలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. డెల్టా వేరియంట్ విరుచుకుపడితే సెకండ్ వేవ్ నాటి రోజులు పునరావృతమయ్యే ప్రమాదముందనీ అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ సంస్థలు వర్క్ ఎట్ ఆఫీస్‌ వైపు మొగ్గుచూపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

9. IPL 2021: సన్‌రైజర్స్‌.. ఆశలు అస్తమయం!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది ప్రత్యేక ప్రస్థానం. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో 2016లో తొలిసారి టైటిల్‌ సాధించిన ఆ జట్టు ఆపై ఏటా ప్లేఆఫ్స్‌ చేరుతూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, ఈసారి పేలవ ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. తాజాగా దిల్లీతో ఆడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు చేసుకుంది. ఒకవేళ ఇప్పుడైనా ప్లేఆఫ్స్‌ చేరాలనే ఆశలు ఉంటే ఇకపై మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.

Ronaldo - Messi:మెస్సీని దాటిన రొనాల్డో

10. Afghanistan: అఫ్గాన్‌తో చైనా, రష్యా, పాక్‌ చర్చలు

తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్, విదేశాంగ మంత్రి ఆమీర్‌ ఖాన్‌ ముత్తకీతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర తాలిబన్‌ ఉన్నతాధికారులతో వారు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో ఇతర వర్గాలను భాగస్వాములుగా చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

* టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ ఆడదా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని