CM Jagan: సొంతింటి క‌ల నెర‌వేరుస్తున్నాం: జగన్‌

తాజా వార్తలు

Updated : 03/06/2021 15:02 IST

CM Jagan: సొంతింటి క‌ల నెర‌వేరుస్తున్నాం: జగన్‌

అమ‌రావ‌తి: రాష్ట్రంలోని పేదవాడి సొంతింటి క‌ల‌ను నెర‌వేరుస్తున్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయ‌ని చెప్పారు. పండ‌గ వాతావ‌ర‌ణంలో ఇళ్ల నిర్మాణాల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో ఆయ‌న ఈ పథకం మొదటి దశను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా 2023 జూన్‌ నాటికి ప్రభుత్వం రెండు దశల్లో 28,30,227 పక్కా గృహాలను రూ.50,994 కోట్లతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు ద‌శ‌ల్లో క‌లిపి 30 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూర‌బోతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. 

జూన్ 2022 నాటికి తొలిద‌శ పూర్తి..

తొలిద‌శ‌లో రూ.28,084 కోట్లు, రెండో ద‌శ‌లో రూ.22,860 కోట్ల‌ వ్య‌యంతో ప‌క్కా గృహాల‌ను నిర్మిస్తున్నామ‌ని జ‌గ‌న్ అన్నారు. తొలిద‌శ‌ను జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామ‌ని.. రెండో ద‌శ‌ను అప్పుడే ప్రారంభిస్తామ‌న్నారు. 8,900 లే అవుట్ల‌లో 11 ల‌క్ష‌ల 26 వేల ఇళ్ల నిర్మాణాల‌కు ఇవాళ శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలు ఉన్న  4.33 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసిన‌ట్లు జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

కాల‌నీల్లో అధునాత‌న సౌక‌ర్యాలు..

జ‌గ‌న‌న్న కాల‌నీల్లో రూ.4,128 కోట్ల వ్య‌యంతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామ‌ని.. రూ.22,587 కోట్ల‌తో కాల‌నీల్లో అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామ‌ని సీఎం చెప్పారు. ఈ కాల‌నీల్లో అధునాత‌న సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

30 ర‌కాల ప‌నులు చేసే వారికి ఉపాధి

ఇళ్ల నిర్మాణం వ‌ల్ల కూలీల‌కు పెద్ద సంఖ్య‌లో పని దినాలు ఉపాధి క‌ల్పించే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ తెలిపారు. 30 రకాల ప‌నుల‌కు సంబంధించిన వారికి ఉపాధి ల‌భించిన‌ట్లు అవుతుంద‌న్నారు. నిర్మాణాల‌కు స‌మీపంలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక అందేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. ఒక్కో ఇంటికి ప్ర‌భుత్వం రూ.ల‌క్షా 80 వేలు ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. అర్హులు ఎవ‌రైనా ల‌బ్ధిదారుల జాబితాలో లేక‌పోతే ఆందోళ‌న చెందొద్ద‌ని.. గ్రామ స‌చివాలయంలో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది. సొంతగా కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు మరో 4.33 లక్షల మంది ఉన్నారు. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును అందించనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని