తెలంగాణ వైఖరితో మా వాటా కోల్పోతున్నాం: జగన్‌

తాజా వార్తలు

Updated : 05/07/2021 14:06 IST

తెలంగాణ వైఖరితో మా వాటా కోల్పోతున్నాం: జగన్‌

కేంద్ర జల్‌శక్తి మంత్రికి మరోసారి ఏపీ సీఎం లేఖ

అమరావతి: కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని సీఎం జగన్‌ అన్నారు. తెలంగాణతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో జగన్‌ మరోసారి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు( కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా నాగార్జున సాగర్‌లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.

‘‘తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కేఆర్‌ఎంబీ ఉత్సాహం చూపుతోంది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను తొలుత సందర్శించాలి. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించాలి. కేఆర్‌ఎంబీ సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోంది. ఆ రాష్ట్ర వైఖరితో కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. శ్రీశైలంలో 834 అడుగుల కన్నా తక్కువున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి విద్యుదుత్పత్తికి తెలంగాణ 19 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం నిండటం దాదాపు అసాధ్యం. శ్రీశైలంలో 854 అడుగుల లేకుంటే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్లలేం. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన ప్రాజెక్టులకు జలాలు రావు. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవు.

ఈ వ్యవహారంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆ రాష్ట్రం ఇచ్చే ఫిర్యాదులపై కేఆర్‌ఎంబీ వేగంగా స్పందిస్తోంది. ఏపీ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా వివక్ష చూపుతోంది. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు పూర్తిచేస్తే శ్రీశైలంలో చుక్క నీరు మిగలదు. మరో అవకాశం లేకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం. సీమ ఎత్తిపోతలతో రోజుకు 3 టీఎంసీల తరలింపు సాధ్యపడుతుంది. ఏపీపై వివక్ష చూపొద్దని కేఆర్‌ఎంబీని ఆదేశించాలి’’ అని జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

త్వరగా అనుమతులివ్వండి: ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ

మరోవైపు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు కూడా సీఎం జగన్‌ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. సీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను జూన్‌ 30న సీడబ్ల్యూసీకి అప్‌లోడ్‌ చేశామన్నారు. ఈ పథకానికి భూసేకరణ చేయడం లేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకులు లేవన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని