పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం: జగన్‌

తాజా వార్తలు

Updated : 08/07/2021 17:13 IST

పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం: జగన్‌

రాయదుర్గం: దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని వైఎస్ నమ్మారని  పేర్కొన్నారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్‌ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని వెల్లడించారు. వైఎస్ స్ఫూర్తిగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా సాగుతున్నాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు.

పాల విప్లవం తీసుకొస్తాం

‘‘కరోనా తదితర సవాళ్లు ఎదురైనా ఎక్కడా రాజీపడలేదు. 3,800 కిలోమీటర్లు పాదయాత్రలో రైతుల కష్టాలు చూశాను. రెండేళ్లలో అన్నదాతల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం. పెట్టుబడి ఖర్చులు ఇచ్చి రైతులకు అండగా ఉంటూ.. రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు అందజేశాం. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆర్‌బీకేల ద్వారా ఈ-క్రాప్‌ విధానం అమలు చేస్తున్నాం. పంటలకు సంబంధించిన వివరాలను ఆర్‌బీకేల్లో నమోదు చేస్తున్నాం. ఈ-క్రాప్‌ తర్వాత పంటల బీమా సహా అన్ని రకాల సేవలను అందిస్తున్నాం. ఆర్‌బీకేల ద్వారా తక్కువ అద్దెకు రైతులకు పనిముట్లు, పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల ఆదాయం పెంపునకు చేయూత, ఆసరా పథకాలు తీసుకొచ్చాం. చేయూత ద్వారా పశువుల కొనుగోళ్లకు రైతులకు సాయం అందిస్తున్నాం. అమూల్‌ ద్వారా ధరలు పెంచి పాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో పాల విప్లవం తీసుకొస్తాం’’ అని జగన్‌ తెలిపారు.

తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు..

‘‘కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. గతంలో సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా ఉందనే విషయం అందిరికీ తెలిసిందే. జలాల కేటాయింపులపై గతంలో ఒప్పందాలు జరిగాయి. కోస్తాకు 360, సీమకు 144, తెలంగాణకు 290 టీఎంసీలు కేటాయించారు. గతంలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం పూర్తి్స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు. 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉంటుంది. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముంది? తెలంగాణ.. కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచి చేపడుతున్నారు. తెలంగాణ 796 అడుగుల్లోనే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. పాలకుల మధ్య సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం. భైరవానితిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాం. ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూసేకరణ జరగాలి. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో ఏపీ జోక్యం చేసుకోదు’’ అని సీఎం వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని