ఏకగ్రీవాల ప్రకటనపై వివరణ కోరా: నిమ్మగడ్డ

తాజా వార్తలు

Published : 28/01/2021 01:21 IST

ఏకగ్రీవాల ప్రకటనపై వివరణ కోరా: నిమ్మగడ్డ

అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చక్కటి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందన్నారు. సీఎస్‌, డీజీపీతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చక్కటి సంబంధాలున్నాయని.. సమన్వయంతో ఎలాంటి పని అయినా నిర్వర్తించుకోగలమనే విషయాన్ని గవర్నర్‌కు తెలిపానని చెప్పారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడారు.

మంత్రి వ్యాఖ్యలు బాధాకరం

రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయనే నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అధికారులతో తనకు ఎలాంటి సమస్యా లేదని.. ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలిపానన్నారు. ఎవరి ప్రాపకం కోసమో ఇద్దరి అధికారులపై చర్యలు తీసుకున్నానంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఎస్‌ఈసీకి ఎవరిపైనా కక్ష సాధింపు ధోరణి ఉండదని.. ఆ అధికారుల పనితీరులో మార్పు ఉంటే పునరాలోచనకూ అవకాశముందని చెప్పారు. నేతలు ఎస్‌ఈసీని వ్యక్తిగతంగా నిందించకుండా సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని స్పష్టం చేశారు. 

ఏ అంశంమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే..

ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల నాలుగైదు పార్టీలు సంప్రదించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్‌ఈసీని సంప్రదించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందని.. ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సమాచార, ప్రసార శాఖను వివరణ కోరినట్లు చెప్పారు. ఎన్నికలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసే ఏ అంశమైనా ఎస్‌ఈసీ దృష్టికి తీసుకురావడం ప్రాథమిక విధి అని సమాచార శాఖకు సూచించానన్నారు. ఏకగ్రీవాలు అపరిమితంగా పెరిగితే దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించినట్లు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు దురుసుగా మాట్లాడినా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ సంఘాలతో సన్నిహితంగా సంబంధాలు నెరిపేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్‌ దృఢంగా వ్యవహరిస్తుందన్నారు. ఎస్‌ఈసీ విధులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని